పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ స్థాపించి, దానిపై వరుసగా సినిమాలు నిర్మిస్తున్న టీజీ విశ్వప్రసాద్ పై ఆసక్తికర పుకారు ఒకటి షికారు చేస్తోంది. ఆయన త్వరలోనే ఓ వార్తా ఛానల్ పెట్టబోతున్నారనేది ఆ పుకారు సారాంశం. ఈ ఊహాగానానికి ఊతమిస్తూ తెరవెనక చాలా వ్యవహారాలు నడుస్తున్నాయి.
రీసెంట్ గా వివాదాస్పదమైన ఓ యాంకర్, ఛానెల్ కు గుడ్ బై చెప్పేసి, ఆఖరి నిమిషంలో మళ్లీ అదే ఛానెల్ లో కొనసాగుతున్నాడు. ఆ సంధి కాలంలో అతడు ఈ నిర్మాతతో టచ్ లోకి వచ్చినట్టు తెలుస్తోంది. మరోవైపు టీజీ విశ్వప్రసాద్ సామాజిక వర్గానికే చెందిన మరో బడా మీడియా వ్యక్తి కూడా టచ్ లోకి వెళ్లారు.
ఇవన్నీ ఒకెత్తయితే.. విశ్వప్రసాద్ కు ఓ పెద్ద జాతీయ పార్టీ నుంచి ఆర్థిక సహకారం అందేలా ఉందని, ఆ పార్టీ ప్రోద్బలంతోనే ఆయన న్యూస్ ఛానల్ పెట్టే ఆలోచన చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. ఇలా తెరవెనక చాలా పావులు కదులుతున్నాయి.
ఇవన్నీ ఒకెత్తయితే, ఇక్కడ మరో ట్విస్ట్ ఉంది. కేంద్ర ప్రభుత్వం కొత్తగా న్యూస్ ఛానల్స్ కు అనుమతులు ఇవ్వడం లేదు. అందుకే ఆల్రెడీ మార్కెట్లో ఉంటూ, రేటింగ్ లేక కిందామీద పడుతున్న మహా టీవీ న్యూస్ ఛానెల్ ను గంపగుత్తగా కొనేయాలని విశ్వప్రసాద్ ఆలోచన చేస్తున్నారట. ప్రస్తుతం ఆ వార్తా ఛానెల్ చంద్రబాబు, తెలుగుదేశం పార్టీకి కొమ్ముకాస్తోంది.
మరోవైపు బీజేపీ సహకారంతోనే విశ్వప్రసాద్, వార్తా ఛానెల్ పెట్టడానికి సన్నద్దమౌతున్నారంటూ కొంతమంది చెప్పుకుంటున్నారు. అదే కనుక జరిగితే కాషాయ పెద్దలతో పాటు పవన్ కల్యాణ్ కు కూడా మరో మీడియా అండ దొరికినట్టవుతుంది. అన్నట్టు ఈ పుకార్లు ఎదుర్కొంటున్న విశ్వప్రసాద్ తాజాగా పవన్ కల్యాణ్ భాగస్వామ్యంతో ఏకంగా 15 సినిమాల నిర్మాణాన్ని ప్రకటించారు.