లాక్ డౌన్ టైమ్ లో హీరో అయిపోయాడు సోనూ సూద్. అడిగినవాళ్లకు కాదనకుండా సహాయం చేశాడు. లాక్ డౌన్ తర్వాత కూడా తన సహాయ కార్యక్రమాలు కొనసాగిస్తూనే ఉన్నాడు. ఓవైపు ఇతడు ఇలా మంచి పనులు చేసుకుంటూ వెళ్తుంటే.. మరోవైపు సైబర్ నేరగాళ్లు ఇతడి పేరును తమ మోసాల కోసం వాడుకోవడం స్టార్ట్ చేశాడు. ఇప్పటికే ఇలాంటి 2-3 కేసులు బయటపడగా.. తాజాగా మరో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది.
సోనూ సూద్ ద్వారా సహాయం ఇప్పిస్తానని చెప్పి ఆశిష్ కుమార్ అనే యువకుడు ట్విట్టర్ లో పోస్ట్ పెట్టాడు. అవసరమైతే తనకు ఫోన్ చేయాలంటూ తన నంబర్ కూడా ఇచ్చాడు. తన రిఫరెన్స్ తో సోనూ సూద్ ద్వారా సహాయం పొందాడంటూ పంకజ్ సింగ్ అనే మరో వ్యక్తి ఫొటో, వివరాలు, ఫోన్ నంబర్ కూడా పెట్టాడు.
పంకజ్ సింగ్ కు ఫోన్ చేసిన చాలామంది ఆశిష్ కుమార్ ను నమ్మారు. తమకు సహాయం కావాలంటూ అభ్యర్థించడం మొదలుపెట్టారు. అలా సహాయం చేయాలంటే ముందుగా ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలంటూ బాధితుల దగ్గర భారీగా డబ్బు వసూలు చేశాడు ఆశిష్.
అయితే ఎప్పటికీ సోనూ సూద్ నుంచి తమకు సహాయం అందకపోవడంతో బాధితులు పోలీసుల్ని ఆశ్రయించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఆశిష్ ను అరెస్ట్ చేశారు. అతడు ఎంత మొత్తంలో డబ్బు కొల్లగొట్టాడు, ఎంత మందిని మోసం చేశాడనే వివరాల్ని ఆరా తీస్తున్నారు. బిహార్ కేంద్రంగా జరిగిన ఈ మోసంలో తెలుగు రాష్ట్రాలతో పాటు, చాలా రాష్ట్రాలకు చెందిన బాధితులు ఉన్నారు.