తెలంగాణలో మళ్లీ మరోసారి డ్రగ్స్ కేసు కలకలం సృష్టించేలా కనిపిస్తోంది. గతంలో సినిమా జనాలకు చాలా మందికి డ్రగ్స్ కేసులో ప్రమేయం వున్నట్లు నానా హడావుడి జరిగింది.
విచారణలు, పరిక్షలు ఒకటి కాదు చాలా అంటే చాలా హడావుడి. కానీ అంతలోనే అది సమసిపోయింది. కానీ కేసు ఇంకా వుందని, చార్జ్ షీట్ పెట్టాల్సి వుందని ఆ మధ్య వార్తలు వినవచ్చాయి.
అయితే ఇప్పుడు మళ్లీ మరోసారి తెలంగాణలో డ్రగ్స్ కలకలం రేగేలా కనిపిస్తోంది. అయితే ఈసారి సినిమాల వైపు నుంచి కాదు. రాజకీయాల వైపు నుంచి. ఇటీవల కర్ణాటకలో సంచలన కలిగించిన డ్రగ్స్ కేసులో తెలంగాణ ఎమ్మెల్యేలకు ప్రమేయం వుందన్న వార్తలు ఈ రోజు గుప్పుమన్నాయి.
బెంగళూరు డ్రగ్స్ కేసులో ఒక్కోక్కరుగా బయటపడుతున్నవారిని పోలీసులు విచారిస్తూ వస్తున్నారు. వీరిలో కొందరికి హైదరాబాద్ మూలాలు వున్నాయి. ఆ మూలాలు వున్నవారికి తెలంగాణలో రాజకీయాలతో, సినిమా జనాలతో వున్న సంబంధాలు బయటపడినట్లు వార్తలు వెలికి వచ్చాయి.
ముగ్గురు ఎమ్మెల్యేలకు డ్రగ్స్ సప్లయి చేసినట్లు వెల్లడియినట్లు తెలుస్తోంది. అంతే కాదు వారిని విచారిస్తున్నట్లూ వార్తలు వచ్చేసాయి. ఈ లెక్కన మరోసారి హైదరాబాద్ లో డ్రగ్స్ కేసు కలకలం సృష్టించేలా వుంది.