పవన్ నామ జపం..వైకాపా వీక్ నెస్

శతృవుని కిట్టని వాడే ఎక్కువ తలుస్తాడు అన్నది పెద్దల మాట. అలాగ్గానే వుంది వైకాపా జనాల పద్దతి. తెలుగుదేశం పార్టీని, చంద్రబాబును వదిలేసారు. లోకేష్ ను మరిచిపోయారు. అనుక్షణం పవన్ నామ జపంతో తరిస్తున్నారు.…

శతృవుని కిట్టని వాడే ఎక్కువ తలుస్తాడు అన్నది పెద్దల మాట. అలాగ్గానే వుంది వైకాపా జనాల పద్దతి. తెలుగుదేశం పార్టీని, చంద్రబాబును వదిలేసారు. లోకేష్ ను మరిచిపోయారు. అనుక్షణం పవన్ నామ జపంతో తరిస్తున్నారు. గత నాలుగు రోజుల్లో వైకాపా జనాలు పవన్ కు ఇచ్చిన ఫ్రీ పబ్లిసిటీ ఇంతా అంతా కాదు. ఛోటా కార్యకర్తల దగ్గర నుంచి మంత్రుల వరకు ఒకటే హడావుడి. అది కూడా పవన్ ఎన్నికల వాహనం చుట్టూనే.

ఎన్నికల వాహనం చేయించింది ఆంధ్రలో టీటైమ్ అనే చెయిన్ దుకాణాలు కలిగిన ఈస్ట్ గోదావరికి చెందిన ఉదయ్ అనే వ్యక్తి. టీ దుకాణాల విషయంలో కొత్తగా ఆలోచించి, వాటి ఫ్రాంచైజీల ద్వారా కోట్లు సంపాదించిన బిజినెస్ మెన్. ఆయన కోటి రూపాయలకు కాస్త అటు ఇటుగా ఖర్చు చేసి ఈ వాహనాన్ని దగ్గర వుండి తయారు చేయించారు. ఆయన రాజమండ్రి లోనో, మరెక్కడో జనసేన టికెట్ ఆశిస్తున్నారు. అందుకోసం ఆయన ప్రయత్నాలు ఆయనవి.

వాహనం మోడల్, డిజైన్, రంగు అన్నీ పవన్ కళ్యాణ్ ఇచ్చారు. హైదరాబాద్ పటాన్ చెరువు ప్రాంతంలో తయారయింది. బాడీ బిల్డింగ్ కంపెనీకి నిబంధనలు అన్నీ తెలిసే వుంటాయి. కానీ కావాలని మిలటరీ యుద్ద వాహనం స్టయిల్ లో, పంజాబ్ మాజీ సైనికుల కవాతు నడుమ ఓ వీడియో వదిలారు. వైకాపా అటాక్ మొదలైంది. తెలంగాణలో రిజిస్ట్రేషన్ జరగకుండా ఆగదు అన్న సంగతి వైకాపా జనాలు గమనించకపోవడం చిత్రం. ఎందుకంటే అక్కడ వున్న అనుబంధాలు అక్కడ వున్నాయి. అలా లేకపోయి వుంటే కాస్త అడ్డంకులు వచ్చేవేమో కానీ ఆ బంధాల వల్ల పని సులువుగా, సజావుగా జరిగిపోయింది.

అప్పుడైనా ఇక వదిలేయాలి. పవన్ ఎలా తిరిగితే అలా తిరగనీండి. ఎలా మాట్లాడితే, ఆ మేరకు మాత్రమే కౌంటర్ ఇవ్వాలి. అంతే తప్ప అదే పనిగా పవన్ జపం చేస్తుంటే అతనికే భయపడుతున్నారు అన్న కలర్ జనాల్లోకి వెళ్తుంది కదా? దమ్ముంటే విడిగా పోటీ చేయ్ అని పవన్ కు సవాల్ విసరడం ఎందుకు. చంద్రబాబుతో కలిసి వెళ్లనివ్వరాదా? ఆ విధంగా వాళ్లిద్దరూ ఒక్కటే అన్న పాయింట్ దానంతట అదే జనాల్లోకి వెళ్తుంది కదా?

చంద్రబాబు-పవన్ కలిస్తే వైకాపాకే బెటర్. పవన్ విడిగా పోటీ చేసినా చంద్రబాబు తేదేపాకు వచ్చే ఓట్లు వస్తాయి. పవన్ కలిస్తే మరి కాస్త అదనం అవుతాయి. దానికే భయపడితే జగన్ రాజకీయం చేయలేరు కదా? 175 స్థానాల్లో పోటీకి నిలబడలేరని పవన్ ను మీరే ఎద్దేవా చేస్తున్నారు. అలాంటి పవన్ పేరే పదే పదే జపిస్తూ అతన్ని మరింత పెద్దగా చూపిస్తున్నారు. ఇది కరెక్టేనా? వైకాపా జనాలు ఆలోచించుకోవాలేమో?