కర్ణాటక నుంచి కొత్తగా ఆలోచించే మూవీ మేకర్స్ రావడం పట్ల హర్షాన్ని వ్యక్తం చేశాడు నటుడు, దర్శకుడు కమల్ హాసన్. 'కాంతార' సినిమాను ఉద్దేశించి కమల్ స్పందిస్తూ కన్నడ సినిమాకు పాత రోజులు వచ్చాయని వ్యాఖ్యానించారు. ఒకప్పుడు 'వంశవృక్ష' 'కాడు' వంటి సినిమాలను అందించిన కన్నడ చిత్ర పరిశ్రమ మళ్లీ ఆ తరహా సినిమాలను అందిస్తోందని కమల్ అభిప్రాయపడ్డాడు.
ఈ ప్రశంస పట్ల రిషబ్ షెట్టి ఆనందం వ్యక్తం చేశాడు. కమల్ కు కృతజ్ఞతలు తెలిపాడు. ఇలా కాంతారపై ప్రశంసల వర్షం కొనసాగుతూ ఉంది.
కమల్ అభిప్రాయం వ్యక్తం చేసిన రీతిలో కన్నడ సీమ నుంచి ఒకప్పుడు మంచి మంచి సినిమాలు వచ్చాయి. వాటిని తెలుగు, తమిళులు, హిందీ వాళ్లు కూడా రీమేక్ లు చేసుకున్నారు. 70ల ఆఖర్లో, 80లలో కర్ణాటక నుంచి కొన్ని గొప్ప సినిమాలు వచ్చాయి.
కమల్ హాసన్ ప్రస్తావించిన సినిమాలే కాకుండా, శర పంజర, గజ్జెపూజె, నాగరహావు.. వంటి సినిమాలు సినీ ప్రేక్షకులను ఆశ్చర్య పరిచాయి. ఇలాంటి సినిమాలు కన్నడలో క్లాసిక్స్ గా నిలిచిపోయాయి. సదరు సినిమాలు తెలుగులో కూడా రీమేక్ అయ్యాయి. శరపంజర సినిమా తెలుగులో 'కృష్ణవేణి' పేరుతో రీమేక్ అయ్యింది. వాణిశ్రీ ప్రధాన పాత్రలో కృష్ణంరాజు ఆ సినిమాను నిర్మించారు. మ్యూజికల్ గా హిట్ కావడంతో పాటు మంచి సినిమాగా ప్రశంసలు అందుకుంది.
ఇక గజ్జెపూజె సినిమా కల్యాణమండపం పేరుతో రీమేక్ అయ్యింది తెలుగులో. నాగరహావును 'కోడెనాగు' పేరుతో రూపొందించారు. కన్నడలో విష్ణువర్ధన్ చేసిన పాత్రను తెలుగులో శోభన్ బాబు చక్కగా చేసినా, తెలుగులో కమర్షియల్ గా ఆ సినిమా ఆడినట్టుగా లేదు. పుట్టణ దర్శకత్వంలో వచ్చిన కన్నడ సినిమాలు అన్నీ దేనికదే ప్రత్యేకంగా నిలిచాయి. నాటి సామాజిక, ఆర్థిక పరిస్థితులకు దర్పణం పట్టాయి ఆ సినిమాలు. అయితే ఆ తర్వాత కన్నడ చిత్ర సీమ పరిస్థితి చాలా మారిపోయింది.
ఆఖరికి సొంతంగా సినిమాలు తీసే పరిస్థితి పోయింది. నూటికి 90 రీమేక్ లు రూపొందాయి. మధ్యలో ఉపేంద్ర వంటి దర్శకులు ఒకటీ రెండు మెరుపులు మెరిపించినా, వాళ్లు కూడా మళ్లీ కమర్షియల్ రూటులో పడిపోయి రీమేక్ లకు అంటుకుపోయాయి. ఇప్పుడు అంతా గుర్తించదగిన మార్పు కనిపిస్తోంది చందన సీమ సినిమాలకు సంబంధించి!