పండగ సినిమాల విడుదలకు ఇంక సమయం సరిగ్గా నెల కూడా లేదు. మూడుకు మూడూ భారీ సినిమాలే. ఏ భారీ సినిమాకు అయినా కనీసం నెల రోజులు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ నే పడుతుంది. షూటింగ్ తో సమాంతరంగా కొన్ని పనులు చేసినా కూడా అసలు పనులు అన్నీ అలాగే వుంటాయి. కానీ ఇక్కడ గమ్మత్తయిన సంగతి ఏమిటంటే మూడు సినిమాకు పోస్ట్ ప్రొడక్షన్ సంగతి అలా వుంచితే షూటింగ్ పనులు కూడా పెండింగ్ లో వుండడం.
విజయ్ వారసుడు వ్యవహారాలు అన్నీ చెన్నయ్ లో జరుగుతున్నాయి. షూట్ ఎక్కువగా లేదు కానీ మిగిలిన పనులు అన్నీ వున్నాయి అని టాక్ వినిపిస్తోంది. బట్ మిగిలిన రెండు సినిమాలతో పోల్చుకుంటే వారసుడు కంఫర్టబుల్ అని యూనిట్ వర్గాల బోగట్టా.
బాలయ్య ‘వీరసింహారెడ్డి’ షూటింగ్ ర్యాప్ అని అన్నారు కానీ ఇంకా అయిదు రోజులు బకాయి వుంది. ఓ పాట తీయాల్సి వుంది. ప్రస్తుతం అనిల్ రావిపూడి సినిమా చేస్తున్న బాలయ్య 18 నుంచి మళ్లీ వీరసింహారెడ్డి షూట్ మీదకు వస్తారు. షూటింగ్ సంగతి ఇలా వుంటే సినిమా ఇంకా ఫైనల్ కట్ ఫిక్స్ కాలేదు. ఇప్పటి వరకు మ్యూజిక్ డైరక్టర్ థమన్ కు ఆర్ఆర్ కు కాపీ ఇవ్వలేదు. ఆర్ఆర్ మొదలుపెట్టాలి. ఆపై మిక్సింగ్ ఇలాంటివి చాలా పనులు వుండనే వుంటాయి.
వాల్తేర్ వీరయ్య పరిస్థితి మరీ చిత్రం. ఓ దగ్గర పాట మరో దగ్గర సీన్లు, ఇంకో దగ్గర ఇంకో సీన్లు అన్నట్లు షూటింగ్ చేస్తున్నారు. పాటకు కొరియాగ్రాఫర్ సరిపోతారు అనుకుంటే మరి మరో రెండు చోట్ల షూటింగ్. అందులో ఒకదానికే డైరక్టర్ వుంటే రెండో దానికి అసోసియేట్ లతో పని కానిస్తున్నారు అనుకోవాల్సిందే.
రెండింటిలోనూ ఒకే హీరోయిన్ కావడం వల్ల సమస్య ఎక్కువ వుందనే వార్తలు వున్నాయి. మొత్తానికి డిసెంబర్ మూడో వారానికి కానీ మెగాస్టార్, బాలకృష్ణల సినిమాల పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఊపు అందుకోదు. ఇరవై రోజుల సమయంలో అన్నీ ఫినిష్ చేసుకోవాల్సి వుంటుంది.