దింపుడు కళ్ళెం ఆశలు ఎపుడూ టీడీపీకే ఉంటాయి. ఓ వైపు ఎన్నికల్లో ఓడిపోతున్నామని తెలిసినా చివరి ఓటు వరకూ చూసి ట్విస్ట్ చేయలనుకోవడం బాబు మార్క్ పాలిట్రిక్స్. దాంతో అదే బాటలో తమ్ముళ్ళూ నడుస్తున్నారు. ఇల్లు అలకగానే పండుగ కాదు జగన్ అంటున్నారు ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ కళా వెంకటరావు.
ఆయన గారి ధీమా ఏంటంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేసు మాదిరిగానే మూడు రాజధానుల మీద జగన్ సర్కార్ చేసిన చట్టాన్ని కోర్టు కొట్టేస్తుందట. అది రాజ్యాంగ విరుధ్ధంగా ఉందిట. అందువల్ల ఈ నెల 6వ తేదీ వరకే జగన్ ఆనందం అంటూ చెప్పుకొస్తున్నారు. మరి నిజంగా అలా జరుగుతుందా. హైకోర్టు 6న రాజధాని పిటిషన్ల మీద విచారణ చేయనుంది.
దాంతో కోర్టులో ఏమైనా అద్భుతం జరగబోతుందా అన్న ఒకే ఒక్క ఆశతోనే టీడీపీ తమ్ముళ్ళలో ఉన్నట్లుగా సీన్ కనిపిస్తోంది. అయితే అన్నీ సక్రమంగా చూసుకుని తాము చట్టాన్ని చేశామని వైసీపీ నేతలు అంటున్నారు.
ఉత్తరాంధ్రాకు రాజధాని వస్తున్నా కూడా ఇంకా అమరావతి పాట పాడుతున్న కళా వెంకటరావు లాంటి వారు వాస్తవాలు గ్రహించాలని, ఉన్న ఊరుకు న్యాయం జరిగేలా తీరు మార్చుకోవాలని కూడా సూచిస్తున్నారు.
విశాఖ రాజధాని వద్దు అన్నవారంతా ద్రోహులుగానే మిగిలిపోతారని కూడా వైసీపీ నేతలు అంటున్నారు. మొత్తానికి విశాఖకు చెందిన ఎమ్మెల్యేలు ఎవరూ ఇప్పటిదాకా ఈ విషయంలో పెదవి విప్పలేదు, సిక్కోలుకు చెందిన కళా మాత్రం జగన్ మీద దాడి చేయడం చూస్తూంటే బాబు మార్క్ పాలిటిక్స్ ని తెరవెనక అమలుచేస్తున్నారని వైసీపీ నేతలు అంటున్నారు.