‘మా’ ఎన్నికల రాజకీయం ఇంకా వేడి రగుల్చుతూనే ఉంది. రోజుకొకరు చొప్పున ఒక్కో అంశాన్ని తెరపైకి తెస్తూ ‘మా’ మంటను ఆర్పకుండా చేస్తున్నారు. ‘మా’ నుంచి ప్రకాశ్‌రాజ్, మెగాబ్రదర్ నాగబాబు తప్పుకోవడంతో ఇక ఎలాంటి వాదవివాదాలకు తావు వుండదని భావించారు. కానీ మున్ముందు ‘మా’లో మరేదో జరగబోతోందనే అనుమానాలకు ప్రకాశ్‌రాజ్ తాజా ట్వీట్ తెరలేపింది.
‘మాకు (ప్యానెల్) మద్దతుగా నిలిచిన ‘మా’ సభ్యులకు నమస్కారం. నేను ‘మా’ సభ్యత్వానికి రాజీనామా చేయడం వెనక లోతైన అర్థం ఉంది. మిమ్మల్ని మేం నిరాశ పరచం. త్వరలోనే అన్నింటినీ వివరిస్తా’ అని పేర్కొన్నారు.
‘మా’ సభ్యత్వానికి రాజీనామా సందర్భంగా ప్రకాశ్‌రాజ్ నిన్న కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రాంతీయత ఆధారంగా ‘మా’ ఎన్నికలు జరిగాయని ఆరోపించారు. లోకల్, నాన్‌లోకల్ లాంటి ఇరుకు భావాలున్న ‘మా’ లో తాను ఇమడలేనని ఆయన తేల్చి చెప్పారు. అయితే సంస్థకు దూరంగా ఉంటూ తన వంతు సాయాన్ని అందిస్తానని పేర్కొన్నారు.
కానీ నేటి ట్వీట్లో మాత్రం నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. రాజీనామా చేయడం వెనక లోతైన అర్థం ఉందని, త్వరలోనే అన్నింటినీ వివరిస్తానని ట్వీట్ చేయడం ద్వారా….ప్రకాశ్‌రాజ్ సంచలనం సృష్టించనున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
రాజీనామాకు మొక్కుబడి కారణాలు మాత్రమే చెప్పారని నేటి ట్వీట్‌తో తెలిసిపోయింది. రానున్న రోజుల్లో చెప్పేవే అసలుసిసలు కారణాలని ప్రకాశ్‌రాజ్ అభిమానులు అంటున్నారు. ఇంతకూ ప్రకాశ్‌రాజ్ మనసులో ఏముంది? ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారో అనే విషయమై పెద్ద చర్చ జరుగుతోంది.