‘మా’ని గాలికొదిలేశారు.. వీళ్లేం పెద్ద మనుషులు!

'మా' ఎన్నికల్లో రచ్చ రచ్చ జరిగింది. విష్ణు గెలిచినా, ప్రకాష్ రాజ్ ఓడినా.. జరగాల్సిన డ్యామేజీ మాత్రం జరిగిపోయింది. అయితే ఇంత గొడవ జరుగుతుంటే అసలు 'మా' పెద్దలు ఏం చేస్తున్నారు. ఎన్నికల ముందు,…

'మా' ఎన్నికల్లో రచ్చ రచ్చ జరిగింది. విష్ణు గెలిచినా, ప్రకాష్ రాజ్ ఓడినా.. జరగాల్సిన డ్యామేజీ మాత్రం జరిగిపోయింది. అయితే ఇంత గొడవ జరుగుతుంటే అసలు 'మా' పెద్దలు ఏం చేస్తున్నారు. ఎన్నికల ముందు, ఎన్నికల సమయంలో సైలెంట్ గా ఉన్న మహామహులంతా.. ఇప్పుడు ఎన్నికలైపోయాక ఎందుకు నోరు తెరుస్తున్నారు. ఏకగ్రీవాల గురించి ఎందుకు ఉపదేశాలిస్తున్నారు.

'మా' ఎన్నికల ముందు పెద్ద తలకాయలు ఒక్క మాట మాట్లాడలేదు. ఆ మాటకొస్తే ఏం మాట్లాడితే ఏమౌవుతుందోననే భయం అందరిలోనూ ఉంది. అందుకే సైలెంట్ గా ఉన్నారు. తీరా ఇప్పుడు ఏకగ్రీవం అయితే బాగుండేది కదా అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. 

తాజాగా దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు మా ఎన్నిక ఏకగ్రీవం అయితే బాగుండేదని అన్నారు. అయినా విష్ణుపై తనకు నమ్మకం ఉందని, ఆయన బాగా చేస్తారని కూడా కితాబిచ్చారు.

అంతకంటే ముందు మురళీమోహన్ కూడా అదే మాట అన్నారు. ఫలితాల వెల్లడి తర్వాత మోహన్ బాబు కూడా ఇదే మాట అన్నారు. ఆ మాటకొస్తే.. చిరంజీవి కూడా ఎన్నికల తర్వాతే నోరు విప్పారు కానీ, ఎలక్షన్ ముందు, మీడియా ముఖంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు.

అయితే జరగాల్సిన రచ్చ అంతా జరిగిపోయి, ఎన్నికల ఘట్టం ముగిసి, ఫలితాలు కూడా వచ్చేసిన తర్వాత తాపీగా డైలాగులు పేల్చారు చిరంజీవి. ఏకగ్రీవం చేసుకుంటే బాగుండేదని, చిన్న చిన్న విషయాలకి 'మా' పరువు తీయొద్దని మాట్లాడారు. 

ఒకరిద్దరి వల్ల 'మా' భ్రష్టు పట్టిపోయిందని విమర్శించిన చిరంజీవి.. ఆ ఒకరిద్దరినీ ఎందుకు కంట్రోల్ లో పెట్టలేకపోతున్నారు, ఎందుకు కూర్చోబెట్టి మాట్లాడలేకపోతున్నారనేది అసలు సమస్య. ఇండస్ట్రీకి అనధికారిక పెద్దమనిషిగా కొనసాగుతున్న చిరంజీవికి కూడా, ఎన్నికలకు ముందు మాట్లాడే ధైర్యం లేకపోయిందనేది ఇక్కడ అంతా గమనించాల్సిన విషయం.

అంతా అయిపోయాక పరువు గుర్తొచ్చిందా?

ఎన్నికల ముందు రెండు ప్యానెళ్లు పోటీ చేస్తున్నాయనే విషయం పెద్దలకు తెలియదా. పోనీ పోటీలో ఉన్న ఇద్దర్నీ కూర్చోబెట్టి ఒప్పించడం వారికి చేతకాలేదా..? కథ చెప్పి హీరో హీరోయిన్లను ఒప్పించే దర్శక దిగ్గజాలు.. ఇప్పుడెందుకు ఎవర్నీ ఒప్పించలేకపోయాయి. ఈమాత్రం చేతకాని వారు పెద్దమనుషులుగా ఎందుకు..? 

సినిమా వాళ్లంతా ఒకటే అని చెప్పుకుంటారు కానీ, సినిమా వాళ్లలో ఎన్ని కుల, మత, ప్రాంత, జాతి భేదాలున్నాయో ఈసారి బాగా బయటపడింది. అంతగా పరువు పోతుంటే పట్టించుకోని పెద్దలు, అసలిప్పుడు ఎందుకు సూక్తిముక్తావళి వల్లించడం. ఎన్నికలకు ముందు బయటకొచ్చి మాట్లాడలేని ఈ పెద్ద మనుషులకు, ఎన్నికల తర్వాత ఏకగ్రీవం అంటూ మాట్లాడే అర్హత లేదు.

బూతులు తిట్టుకుంటుంటే చూస్తూ ఊరుకుంటారా..?

'మా' ఎన్నికల ప్రచారంలో ప్రత్యర్థులు మరీ నీచ స్థాయిలో విమర్శలు చేసుకున్నారు, చివరకు ఎన్నికల రోజు బూతులు తిట్టుకున్నారు, జాంబీల్లాగా కొరుక్కున్నారు. చొక్కాలు చించుకున్నారు. ఇంత దరిద్రమంతా జరుగుతుంటే పెద్దోళ్లు ఎందుకు ముందుకు రాలేదు. తప్పు చేసిన వారిని, చేశారనుకున్నవారిని ఎందుకు మందలించలేదు. అంతా అయిపోయి పరువు బజారున పడ్డాక, తీరా ఇప్పుడు బయటకొచ్చి ఏకగ్రీవం గురించి మాట్లాడటం వాళ్ల ఉదాసీనతకు పరాకాష్ట.

తాజా ఎన్నికలతో 'మా' పరువు పోయింది. 'మా' పెద్దరికం మంటగలిసింది. పరిశ్రమ పెద్ద మనుషులం అనుకునేవాళ్లు ఇప్పటికైనా తమ పెద్దరికం ఏ పాటిదో గుర్తిస్తే మంచిది.