వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రజారోగ్యం విషయంలో 'ఆరోగ్య శ్రీ' వంటి అద్భుతమైన పథకం ప్రారంభం అయ్యింది. ప్రపంచంలో ప్రజల ఆరోగ్యం పట్ల శ్రద్ధపెట్టే ప్రభుత్వాలు చాలా తక్కువ దేశాల్లో ఉన్నాయి. ఉచితంగా వైద్యసేవలు అందించే దేశాలు చాలా చాలా తక్కువ. బాగా అభివృద్ది చెందిన, మానవ వనరులకు అపారమైన విలువను ఇచ్చే దేశాల్లో మాత్రమే అలాంటి పథకాలు అమల్లో ఉన్నాయి. ఇండియాలో అలాంటి సాధ్యం అని ఎవరూ అనుకోలేదు.
అలాంటి అసాధ్యం అనుకున్న పథకాన్ని అద్భుత రీతిలో సాధ్యంచేసి చూపించారు వైఎస్ రాజశేఖరరెడ్డి. ఆ తర్వాత ఆ పథకం అనేక రాష్ట్రాల్లో మొదలైంది. పేదవారికి వైద్యసేవలు అందిస్తూ ఉంది. వైఎస్ వేసిన అడుగును ఆ తర్వాత అనేకమంది ముఖ్యమంత్రులు ఫాలో అవుతూ ఉన్నారు. ఏపీలో వేరే ప్రభుత్వాలు వచ్చినా ఆరోగ్య శ్రీని టచ్ చేయలేకపోయాయి. అలాంటి అద్భుత కార్యక్రమానికి శ్రీకారం చుట్టి వైఎస్ జనం గుండెల్లో చిరంజీవిగా నిలిచిపోయారు.
ఇక ఇప్పుడు ఆయన తనయుడు ముఖ్యమంత్రి హోదాలో మరో విప్లవాత్మక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తండ్రి పేరుతో 'వైఎస్సార్ కంటివెలుగు' పథకాన్ని జగన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని అనంతపురం నుంచి ప్రారంభించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. రాష్ట్రంలోని వివిధ జిల్లా కేంద్రాల్లో అధికార పార్టీ నేతలు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగా, ముఖ్యమంత్రి హోదాలో జగన్ మోహన్‌రెడ్డి అనంతపురం నుంచి ఈ పథకాన్ని ప్రారంభించారు.
ఇటీవలి ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సాధించిన ప్రభంజనం లాంటి విజయంలో అనంతపురం వాటా కూడా గట్టిగానే ఉంది. అంతకు ముందు ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కేవలం రెండే అసెంబ్లీ సీట్లను ఇచ్చిన అనంతపురం జిల్లా, ఇటీవలి ఎన్నికల్లో మాత్రం రెండు సీట్లను మాత్రమే టీడీపీకి ఇచ్చింది. అవి కూడా వైసీపీలో విబేధాల వల్ల టీడీపీ ఖాతాలోకి వెళ్లేయే కానీ, సరిగ్గా పని చేసుకుని ఉంటే.. జగన్ పార్టీ అనంతపురం జిల్లాలో స్వీప్ చేసేది!
ఇక ప్రస్తుతం కూడా అనంతపురం జిల్లా రైతాంగం జగన్ పట్ల సంతృప్తి కరంగానే ఉంది. అందుకు ప్రధాన కారణం.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాకా పుష్కలమైన వానలు పడుతూ ఉండటం. అనంతపురం చరిత్రలోనే గత కొన్ని దశాబ్దాల్లో ఎరగని స్థాయి వర్షాలు ఈ సంవత్సరం కురిశాయి. దశాబ్దాల తర్వాత కొన్ని చెరువులు నిండాయి, మరువలుపోయాయి. ఇక వేరుశనగ పంట కూడా రైతుల చేతికి అందే సమయం వచ్చింది. ఆరంభంలో కొంత వర్షాలు కురకపోవడంతో దిగుబడి తగ్గే అవకాశాలు ఉన్నాయి.
అయితే రైతులు ఆనందంగా ఉన్నారు. ఎంతోకొంత పంట దిగుబడి రావడం ఖాయంగా ఉంది. అలాగే పశువులకు పుష్కలమైన గ్రాసం లభిస్తుంది. ఈ నేపథ్యంలో రైతాంగం ఆనందానికి అవధులు లేవు. ఇక చెరువులు, కుంటలు నిండటంతో.. భూగర్భజలం పెరిగింది. బావులు, బోర్లలో నీళ్లు పుష్కలంగా లభించే అవకాశాలున్నాయి. ఇదంతా జగన్ మోహన్‌రెడ్డి పాలన మొదలయ్యాకా వచ్చిన మార్పు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి హోదాలో జగన్ తొలిసారి అనంతపురం జిల్లాకు వెళ్లడంతో ఈ అంశంపై స్థానికుల్లో చర్చ జరుగుతూ ఉంది.