వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఘాటైన పంచ్ విసిరారు. తెలంగాణ రాజకీయాల్లో టీఆర్ఎస్ నేతలపై షర్మిల ఓ రేంజ్లో విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల కవితపై కూడా షర్మిల దూకుడుగా ఆరోపణలు చేశారు. ఒక మహిళా నాయకురాలై వుండి లిక్కర్ కుంభకోణంలో ఇరుక్కోవడం ఏంటని షర్మిల నిలదీసిన సంగతి తెలిసిందే. వరంగల్ పోలీసులు అడ్డుకోవడంతో షర్మిల పాదయాత్ర తెలంగాణలో నిలిచిపోయింది.
ఈ నేపథ్యంలో మీడియాతో కవిత చిట్‌చాట్‌లో షర్మిలపై ఘాటు విమర్శలు చేశారు. షర్మిలను ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌తో పోల్చడం గమనార్హం. త్వరలో షర్మిల పాల్ అంటారని కవిత వ్యంగ్యంగా అన్నారు. తెలంగాణలో షర్మిలకు అస్తిత్వమే లేదని చెప్పుకొచ్చారు. షర్మిల, కేఏ పాల్, బీఎస్పీ నాయకుడు ప్రవీణ్‌కుమార్‌లు కమలం వదిలిన బాణాలుగా కవిత అభివర్ణించారు.
తనపై టీఆర్ఎస్ నేతల నుంచి విమర్శలు రావాలని షర్మిల కోరుకుంటున్నారు. ఎందుకంటే అధికార పార్టీ తన ఉనికిని గుర్తిస్తే రాజకీయంగా అది ప్రయోజనమని షర్మిల భావిస్తున్నారు. షర్మిల ఆశిస్తున్నట్టే టీఆర్ఎస్ నేతలు ఇటీవల కాలంలో ఆమెను టార్గెట్ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా కేసీఆర్ కూతురే తనపై విమర్శలు చేయడం షర్మిలకు ఆనందం కలిగించేదే.
ఇటీవల ట్విటర్ వేదికగా ఇద్దరు మహిళా నాయకురాళ్లు ఫైట్ చేశారు. తాజాగా తనను కేఏ పాల్‌తో పోల్చడంపై షర్మిల సీరియస్‌గా రియాక్ట్ అయ్యే పరిస్థితి వుంది. అది ఏ రేంజ్లో వుంటుందో అనే చర్చకు తెరలేచింది.