ఐటీకి తామే బ్రాండ్ అంబాసిడర్ అని తెలుగుదేశం పార్టీ గట్టిగా చెప్పుకుంటుంది. తామే అంతా చేశామని గొప్పలు కూడా పోతుంది. అయితే వాస్తవాలు వేరేగా ఉంటున్నాయి అని ఇతర పక్షాలు చెబుతూంటాయి. హైదరాబాద్ లో ఐటీ రాకముందే బెంగుళూరులో అది టాప్ రేంజిలో ఉంది అన్నది కన్వీనియెంట్ గా టీడీపీ మరచిపోతుంది. ఎవరూ మాట్లాడరు.
అలాగే చూసుకుంటే 1990 తరువాత ప్రపంచవ్యాప్తంగా ఐటీ సెక్టార్ ఊపందుకుంది. అయినా సరే ఉమ్మడి ఏపీ సీఎం గా చంద్రబాబు కేవలం హైదరాబాద్ మీదనే దృష్టి పెట్టారు. ఆయన విశాఖ వైపు ఎందుకో ఫోకస్ చేయకపోగా శీత కన్ను వేశారు అన్న విమర్శలు ఉన్నాయి. వైఎస్సార్ సీఎం అయ్యాక టైర్ టూ సిటీలలో కూడా ఐటీని ముందుకు తీసుకురావాలన్న ఉద్దేశ్యంతో విశాఖలో ఐటీ ప్రమోషన్ చేశారు.
అప్పట్లో వచ్చిన కంపెనీలే ఈ రోజుకీ ఉన్నాయి. ఆ విధంగా చూస్తే విభజన తరువాత విశాఖ ఒక మాదిరి ఐటీ లుక్ తో ఉంది అంటే అది వైఎస్సార్ పుణ్యమే అని అంటారు. విశాఖలో ఐటీ అభివృద్ధి తాము ఎంతో చేశామని తెలుగుదేశం నాయకులు మాట్లాడితే చెప్పుకుంటారు. కానీ జరిగినదేంటి అన్నది వైసీపీ నుంచి కాదు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు చెప్పారు.
విశాఖలో ఐటీ డెవలప్మెంట్ అంటూ టీడీపీ హయంలో ఎలాంటి గుర్తింపు లేని ఐటీ కంపెనీలకు సబ్సిడీలు పెద్ద ఎత్తున ఇచ్చారని ఆయన ఆరోపించారు. దాని వల్ల ఐటీ పరిశ్రమ విశాఖలో అభివృద్ధి చెందకకపోగా ప్రభుత్వ ధనం పూర్తిగా దుర్వినియోగం అయిందని ఆయన కొత్త పాయింట్ ఒకటి బయటపెట్టారు.
విశాఖలో వైసీపీ హయాంలో ఇన్ఫోసిస్ తో పాటు మరో రెండు ప్రఖ్యాతి చెందిన పరిశ్రమలు వచ్చాయని, రానున్న రోజుల్లో ఐటీ పరంగా విశాఖ రాజధాని అవుతుందని పరిశ్రమల మంత్రి గుడివాడ అమరనాధ్ వెల్లడించడం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. ఏనాటికైనా ఐటీ పరంగా విశాఖ ముందు ఉంటుందని నాడు వైఎస్సార్ వేసిన బాటలో నడవబట్టే ఇపుడు వరసబెట్టి ఐటీ కంపెనీలు విశాఖ వైపు చూస్తున్నాయని వైసీపీ నేతలు చెబుతున్నారు. చంద్రబాబు ఐటీ అంటే సర్కార్ సొమ్ము లూటీ అని వారు విమర్శిస్తున్నారు.