ప్రపంచం అంతటా అవతార్ 2 ఫీవర్ అలుముకుంటోంది. తెలుగు నాట కూడా తక్కువేమీ లేదు. ఎ సెంటర్లతో పాటు బి సెంటర్లలో కూడా అవతార్ సీక్వెల్ విడుదలవుతోంది.
ఇంటస్ట్రింగ్ విషయం ఏమిటంటే అవతార్ 2 మేకింగ్ లో మన తెలుగు మూలాలు వున్నాయి. ఎంత హాలీవుడ్ సినిమా అయినా తెలుగులో విడుదల చేయాలంటే మనవాళ్లే కదా మాటలు రాయాల్సింది. కంప్యూటర్ అనువాదాలు పనికి రావు కదా. మన రైటర్లను పట్టుకోవల్సిందే.
అయితే అవతార్ టైమ్ మన రెగ్యులర్ రైటర్ల జోలికి వెళ్లలేదు. విలక్షణ నటుడు, దర్శకుడు, రచయిత అయిన అవసరాల శ్రీనివాస్ ను ఎంచుకుంది. విదేశాల్లో వుండి వచ్చిన, విదేశీ సినిమాల మీద ఫుల్ గ్రిప్ వున్న అవసరాల అయితే అనువాదం పెర్ ఫెక్ట్ గా వుంటుందని ఫీలయినట్లుంది. అందుకే ఆ అవకాశం అవసరాలకు దక్కింది. అవసరాల తెలుగు సినిమాల డైలాగులు కూడా క్లుప్తంగా, షార్ప్ గా వుంటాయి. హాలీవుడ్ సినిమాల స్టయిల్ కు అవసరాల పెన్ పెర్ ఫెక్ట్ గా సరిపోతుంది.
అవతార్ సీక్వెల్ ను జేమ్స్ కేమరాన్ అతని బృందం ఏళ్ల తరబడి శ్రమించి తయారు చేసారు. ప్రపంచంలోనే అత్యంత వ్యయంతో రూపొందించిన సినిమాల్లో అవతార్ సీక్వెల్ ఒకటి. ప్రపంచవ్యాప్తంగా స్వంతంగానే విడుదల అవుతోంది.