బిగ్‌బాస్ రియాల్టీ షో సీజన్-6 చివరి మజిలీ రానే వచ్చింది. మరో ఐదు రోజుల్లో ఈ సీజన్ విజేత ఎవరో తేలనుంది. ప్రస్తుతం ఓటింగ్ ట్రెండింగ్ పరిశీలిస్తే …సెలబ్రిటీస్ వర్సెస్ కామన్ మ్యాన్ అనే రేంజ్‌లో ఫైట్ సాగుతోంది. బిగ్‌బాస్ హౌస్‌లో ప్రస్తుతం ఆరుగురు కంటెస్టెంట్లు ఉన్నారు. చివరికి వచ్చే సరికి ఐదుగురిని మాత్రమే ఉంచుతారు. దీంతో బుధవారం మిడ్ వీక్ ఎలిమినేషన్ వుంటుంది.
అనధికార ఓట్ల ట్రెండ్‌ను పరిశీలిస్తే కీర్తి లేదా శ్రీసత్య ఎలిమినేషన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. శ్రీసత్య బయటికి వచ్చేందుకు ఎక్కువ అవకాశాలున్నాయని సమాచారం. ఇక విన్నర్, రన్నర్‌ల గురించి జోరుగా చర్చ జరుగుతోంది. అనధికార ఓటింగ్ సరళిని పరిశీలిస్తే రేవంత్, ఆదిరెడ్డి, శ్రీహాన్ మధ్య గట్టి పోటీ సాగుతోంది.
కామన్ మ్యాన్ కేటగిరీలో ఆదిరెడ్డి బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంటర్ ఇచ్చారు. ఎవరూ ఊహించని విధంగా అతను హౌస్‌లో పాతుకు పోయారు. గత సీజన్లలో కామన్ మ్యాన్ కేటగిరి కింద వెళ్లిన వాళ్లంతా నాలుగైదు వారాల కంటే ఎక్కువ ప్రేక్షకుల ఆదరణ పొందలేకపోయారు. అందుకు భిన్నంగా ఆదిరెడ్డి ప్రతి వారం తన ఫర్మామెన్స్‌ను మెరుగు పరుచుకుంటూ సెలబ్రిటీల కంటే మిన్నగా ప్రేక్షకుల ఆదరణ పొందడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
బిగ్‌బాస్ రియాల్టీ షోలపై రివ్యూలు చేస్తూ… అదే హౌస్‌లోకి ఆదిరెడ్డి ఎంటర్ కావడం విశేషం. కామన్ మ్యాన్‌గా అవకాశం దక్కించుకోవడమే గొప్ప అనుకున్న నేపథ్యంలో చివరి వరకూ కొనసాగడం అందర్నీ ఆశ్యర్యపరుస్తోంది. ఇక మిగిలిన కంటెస్టెంట్ల విషయానికి వస్తే సింగర్‌గా రేవంత్, బుల్లితెర నటుడిగా రోహిత్, అలాగే యూట్యూబర్‌గా, సిరి హనుమంతు లవర్‌గా శ్రీహాన్ ప్రేక్షకులకు సుపరిచితులే. వీళ్లందరూ ఎంతోకొంత జనానికి పరిచయస్తులే. ఈ నేపథ్యంలో ఫైనల్ ఓటింగ్‌లో నువ్వానేనా అన్నట్టు సెలబ్రిటీలతో కామన్ తలపడుతున్నాడు. చివరికి విజేతగా ఎవరు నిలవనున్నారో మరి!