'మీవల్ల కాదు, ఇక మీరు తప్పుకోండి.. మీ కుమారుడిని సిఎమ్ చేయండి' అని భాజపా కింగ్ పిన్ అమిత్ షా అన్నారా? అలా అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సలహా ఇచ్చారా? వారం వారం కొత్తపలుకు అంటే ఒకటే పలుకు పలికే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఈవారం పలికిన పలుకు ఇది.
తననుచూసీ చూడనట్లు వదిలేయలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పోయి పోయి అమిత్ షాకు విన్నవించుకున్నారని, కానీ ఆయన దానికి సానుకూలంగా స్పందించలేదని, పైగా 'మీ వల్ల కాదు, మీ కొడుకును సిఎమ్ చేయండి' అని సలహా ఇచ్చినట్లు తనకు తెలిసిందని రాధాకృష్ణ తమ కాలమ్ లో వెల్లడించారు.
ఇదేం లాజిక్ నో అర్థంకాదు. పోనీ అమిత్ షా అన్నట్లు కేటీఆర్ ను మఖ్యమంత్రిని చేసారే అని అనుకున్నా, అప్పుడు కేసీఆర్ మాట జవదాటి కేటీఆర్ ముందుకు వెళ్తారని భాజపా నేతలు అనుకుంటున్నారా? లేదా ఇలా రాయడం ద్వారా, కేటీఆర్ మనసులో అంతర్లీనంగా వున్న ముఖ్యమంత్రి కావాలనే కోరికను రెచ్చగొట్టే ఆలోచన రాధాకృష్ణ చేసారా? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.
గత ఎన్నికల తరువాత కేసీఆర్ కు వ్యతిరేకంగా పెద్దగా పలుకు పలకని రాధాకృష్ణ, కొత్తగా రాష్ట్రంలో తలెత్తుతున్న పరిస్థితులు గమనించి, ఈసారి కాస్త గట్టిగానే కలం విదిలించారు. కానీ ఆ విదిలించడం కూడా చాలా పద్దతిగా కేసీఆర్ కు ఆగ్రహం కలిగే విధంగా కాకుండా, కాస్త నిజాలు చెబుతున్నట్లు, కేసీఆర్ కాస్త ఆలోచించాలి అన్నట్లు, సుద్దులు చెబుతున్నట్లు సాగడం విశేషం.
ఎంత భోం చేసినా, చివర్న తీపి తినకపోతే, అస్సలు తిన్నట్లే కాదన్నట్లుగా, ఎవరిమీద ఎంత రాసినా, పనిలోపనిగా జగన్ మోహన్ రెడ్డిని ఏదో విధంగా, ఏదో ఒకటి అనకపోతే రాసినట్లు కాదు. అందుకే పనిలో పనిగా, చంద్రబాబు, కేసీఆర్ ల అనుభవాలను చూసి, జగన్ మోహన్ రెడ్డి నేరుగా కేంద్రానికి సరెండర్ అయిపోయారని, కేంద్రం తలచుకుంటే, జగన్ ను ఓ పట్టు పట్టడం అయిదు నిమిషాల అని ముక్తాయించారు.