మాయ మాటలు చెప్పి పెళ్లి చేసుకున్నాడు. పిల్లని కన్నారు. ఇప్పుడు తనకు సంబంధం లేదంటూ ముఖం చాటేశాడు. దీంతో బాధిత మహిళ తన ఐదేళ్ల కూతురితో కలిసి అత్తింటి వద్ద ధర్నాకు దిగింది. ఇప్పుడు అందరి దృష్టి ఆ మహిళపై పడింది. ఎడారి దేశంలో వాళ్లిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఆ తర్వాత పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. వాళ్ల ప్రేమ దాంపత్యానికి చిహ్నంగా అమ్మాయి పుట్టింది. ఆరేళ్ల సంసార జీవితంలో ఆమెపై మోజు తీర్చుకుని ఇప్పుడు కాదు, కూడదంటున్న ఓ వంచకుడి కథ ఇది.
ప్రకాశం జిల్లా కొమరోలు మండలం అల్లీనగరం గ్రామానికి చెందిన ఆవులమంద శేఖర్ పొట్ట చేత పట్టుకుని సౌదీ వెళ్లాడు. అక్కడ పనిలో కుదురుకున్నాడు. ఉపాధి కోసం వెళ్లిన కడప జిల్లా చెన్నూరుకు చెందిన నాగమణి అనే యువతితో అక్కడ శేఖర్‌కు పరిచయం ఏర్పడింది. ఇద్దరూ సమీప జిల్లాల వాసులతో పాటు ఒకే కులస్తులు కావడంతో సాన్నిహిత్యం ఏర్పడింది.
ఆ సాన్నిహిత్యం ఇద్దరి మధ్య ప్రేమను అంకురింపుజేసింది. సౌదీలోనే ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. అక్కడే ఇద్దరూ కలిసి ఆరేళ్లు కాపురం చేశారు. ఓ పిల్లని కూడా కన్నారు. ప్రస్తుతం ఆ చిన్నారి వయస్సు ఐదేళ్లు. సౌదీ నుంచి తన స్వగ్రామానికి శేఖర్ తిరిగి వచ్చాడు. భార్య, పాప గురించి ఏ మాత్రం పట్టించుకోలేదు.
తనకు నాగమణికి, ఐదేళ్ల కూతురితో ఎలాంటి సంబంధం లేనట్టు వ్యవహరించాడు. అసలు వాళ్ల వైపు కన్నెత్తి కూడా చూడ లేదు. దీంతో తాను మోసపోయానని నాగమణి గ్రహించింది. భర్త కోసం పెద్ద మనుషుల వద్ద పంచాయితీ పెట్టింది. అప్పుడు శేఖర్ చావు కబురు చల్లగా చెప్పాడు. అదేంటంటే… తనకు రూ.నాలుగు లక్షల కట్నం కావాలని, ఆ సొమ్ము ఇస్తే భార్యగా ఒప్పుకుని కాపురానికి తెచ్చుకుంటానని శేఖర్ తెగేసి చెప్పినట్టు బాధిరాలు కన్నీటిపర్యంతమవుతోంది.
సౌదీలో తాను సంపాదించిన రూ.8 లక్షల డబ్బును భర్తకే ఇచ్చానని, ఇక ఇచ్చేందుకు తన వద్ద ఏమీ లేదని బాధితురాలు నిస్సహాయంగా చెబుతోంది. రెండు రోజుల క్రితం తన భర్త ఇంటి నుంచి వెళ్లిపోయాడని, ఆ తర్వాత అసలు ఇటు రాలేదంది. తన అత్తమామలు తనకు, తన బిడ్డకు అన్నం పెట్టకుండా ఇంటికి తాళం వేసుకుని వెళ్లిపోయారని బాధితురాలు చెబుతోంది. దీంతో మరో గత్యంతరం లేక ఇంటి ముందే ధర్నా చేస్తున్నట్లు కన్నీటిపర్యంతమైంది.
పోలీసు అధికారులు తనకు న్యాయం చేయాలని నాగమణి వేడుకుంటోంది. ఈ విషయమై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని బాధితురాలితో మాట్లాడి వివరాలు సేకరించారు. శేఖర్‌ను పట్టుకొచ్చి న్యాయం చేస్తామని, దీక్ష విరమించి ఇంటికెళ్లాలని పోలీసులు సూచించారు. బాధితురాలికి పోలీసులు ఏ మాత్రం న్యాయం చేస్తారో చూడాలి మరి.