అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లుపై గవర్నర్ ఆమోద ముద్ర పడిన తర్వాత రాష్ట్రంలోని రాజకీయ నేతలంతా స్పందించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు తమ అభిప్రాయాలు వెళ్లడించారు. అధికార పార్టీ గవర్నర్ నిర్ణయాన్ని స్వాగతించింది, ప్రతిపక్షం అంతెత్తున ఎగిరిపడింది. ఆ రెండూకాని జనసేన, బీజేపీ కూడా తమకు తోచినట్టు స్పందించాయి. వీటి గురించి మాట్లాడని ఒకే ఒక్క వ్యక్తి సీఎం జగన్.
ఆయనంతే, ఏదీ మాట్లాడరు. చేసి చూపెడతారంతే. కోర్టులు తన ప్రభుత్వ నిర్ణయాలను తప్పుపడితే ఎక్కడా తొణకరు, బెణకరు. తన పని తాను చేసుకుని వెళ్తారు. నిమ్మగడ్డ విషయంలో తగ్గారు, ఆ వెంటనే మూడు రాజధానుల విషయంలో నెగ్గారు. అప్పుడాయన చిన్నబుచ్చుకోలేదు, ఇప్పుడు సంబరాలు చేసుకోలేదు. ఆ రెండింటికీ అతీతుడు జగన్.
అయితే ఇలా తన మౌనంతోనే ప్రతిపక్షాలను చంపేస్తున్నారు జగన్. ఈ విషయంపై ముఖ్యమంత్రి మాట్లాడితే ఆయనపై విరుచుకుపడిపోవాలని చూస్తున్నాయి టీడీపీ, బీజేపీ, జనసేన. కన్నా లక్ష్మీనారాయణ అధీనంలో ఉన్నంతకాలం టీడీపీ వాదనకు బీజేపీ వంతపాడేది. ఆ వంతకి మరోవంత పాడేవారు జనసేనాని. ఇప్పుడు పరిస్థితి మారింది. మరీ గుడ్డిగా టీడీపీ బాటలో వెళ్లకపోయినా రాష్ట్ర బీజేపీ నేతలు కూడా జగన్ ని తప్పుపట్టాలనే చూస్తున్నారు. అయితే వారికి అవకాశం దొరకడం లేదు. జగన్ ఆ ఛాన్స్ ఇవ్వడం లేదు.
మూడు రాజధానులతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని అందుకే అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తున్నామని గతంలో అసెంబ్లీ సాక్షిగా చెప్పారు జగన్. అమరావతి రైతులకు అన్యాయం జరగదని, అసెంబ్లీయే అమరావతిలో ఉండగా వారి ఆందోళనకు అర్థం లేదని చెప్పుకొచ్చారు. పైగా సరికొత్త విధానంతో ఏఎంఆర్డీఏ (అమరావతి మెట్రోపాలిటిన్ రీజనల్ డెవలప్ మెంట్ అథారిటీ) ఏర్పాటుచేశారు.
జగన్ ఇచ్చిన మాటకి కట్టుబడి ఉన్నారు. అదే చేస్తున్నారు కూడా. అయితే మరోసారి ఆయన మాట్లాడితే రాద్ధాంతం చేయాలని ప్రతిపక్షాలు, పచ్చ మీడియా వేచి చూస్తున్నాయి. కానీ వారికి ఆ ఛాన్స్ ఇచ్చేలా లేరు జగన్. తన మౌనంతో వారిని హింసిస్తున్నారు.