నిన్నటి వరకు ఒకటే గుసగుసలు సంక్రాంతి సినిమాల విడుదల డేట్ ల. ఇంతలో వున్నట్లుండి, అధికారికంగా జనవరి 12న వస్తున్నట్లు 'అల వైకుంఠఫురములో' సినిమా ప్రకటన. అది వచ్చిన కొన్ని గంటలకు 'సరిలేరు నీకెవ్వరు' కూడా డిటో.. డిటో. ఏమిటిదంతా? ఉన్నట్లుండి ఏం జరిగింది. అర్జెంట్ గా ఇలా బయటపడ్డారు? దీనివెనుక చాలా వ్యవహారం జరిగింది.
నిన్న ఉదయమే అంటే శనివారం ఉదయమే నిర్మాత సురేష్ బాబు ఆధ్వర్యంలో వెంకీమామ యూనిట్ మీటింగ్ జరిగింది. అంతకు ముందురోజే టాలీవుడ్ బిజినెస్ సర్కిళ్లలో, ముఖ్యంగా సురేష్ బాబుతో అసోసియేట్ అయిన డిస్ట్రిబ్యూటర్ల సర్కిళ్లలో వెంకీమామ సినిమా సంక్రాంతి డేట్ ను పరిశీలిస్తోందని వార్తలు వచ్చాయి.
వెంకీమామ మీటింగ్ లో డేట్ పట్ల సానుకూలత వచ్చింది కానీ థియేటర్లు అన్నీ ఇప్పటికే చాలావరకు దిల్ రాజు బ్లాక్ చేయడంతో, ఆంధ్రలో గట్టిగా 300 థియేటర్లకు మించి దొరకవు అన్న ఒపీనియన్ వచ్చింది. అంతకన్నా వెంకీ బర్త్ డే అయిన డిసెంబర్ 13న వస్తే ఎలా వుంటుంది అన్న డిస్కషన్ కూడా వచ్చింది.
వెంకీమామ సినిమాను ఆంధ్రలో 18 కోట్ల మేరకు అమ్మాలని చూస్తున్నారు. ఆ బడ్జెట్ రావాలంటే సోలోగా మంచి డేట్ కు రావాలి లేదా సంక్రాంతి లాంటి సీజనల్ డేట్ కావాలి. అలా వెంకీమామ డిసెంబర్ 13, 20, సంక్రాంతి డేట్ ల మధ్య ఆగింది.
దీంతో 'అల',''సరిలేరు' యూనిట్ లకు అనుమానం వచ్చింది. సురేష్ బాబు కనుక వున్నట్లుండి జనవరి 12న అని ప్రకటిస్తే పరిస్థితి ఏమిటి? అని. దాంతో ఈ ఆదివారం డేట్ అనౌన్స్ చేయాలని 'సరిలేరు' యూనిట్ ఫిక్స్ అయింది. అది తెలిసి హారిక హాసిని అర్జెంట్ గా పది నిమిషాల్లో ప్రకటన వదిలేసింది. దాంతో ఆదివారం వరకు వెయిట్ చేయకుండా శనివారం రాత్రే మహేష్ బాబు ట్వీట్ ద్వారా తన సినిమా డేట్ కూడా ప్రకటించేసారు.
ఇలా ఈ రెండు సినిమాల డేట్ లు బయటకు వచ్చేలా చేసిన వెంకీమామ డైలాగా మాత్రం ఇంకా అలాగే వుంది. డిసెంబర్ 13, 20, 25, జనవరి 15 అంటూ లెక్కలు కట్టడం దగ్గరే ఆగిపోయింది. ఏమయినా ఈ సంక్రాంతి సినిమా పందాల జోరు మాత్రం మా రంజుగా మారుతోంది.