ఇది ఫిక్స్.. తిరుపతి నుంచే పవన్ పోటీ?

పవన్ కల్యాణ్ వచ్చే ఎన్నికల్లో ఎక్కడినుంచి పోటీ చేస్తారనే విషయంపై ఓ క్లారిటీ వచ్చింది. తనకి తిరుపతి నుంచి పోటీ చేయాలనే కోరిక ఉన్నట్టు అప్పుడప్పుడూ లీకులిస్తూనే ఉన్నారు పవన్. ఆమధ్య తిరుపతి లోక్…

పవన్ కల్యాణ్ వచ్చే ఎన్నికల్లో ఎక్కడినుంచి పోటీ చేస్తారనే విషయంపై ఓ క్లారిటీ వచ్చింది. తనకి తిరుపతి నుంచి పోటీ చేయాలనే కోరిక ఉన్నట్టు అప్పుడప్పుడూ లీకులిస్తూనే ఉన్నారు పవన్. ఆమధ్య తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలప్పుడు కూడా పవన్ హడావిడి అందుకే. అయితే ఇటీవల మరికొన్ని ఆప్షన్లు కూడా పరిశీలించాక ఫైనల్ గా తిరుపతిని ఆయన తన నియోజకవర్గంగా ఫిక్స్ చేసుకున్నట్టు తెలుస్తోంది. 

గతంలో చిరంజీవి ఎమ్మెల్యేగా ఎన్నికైన తిరుపతిని ఇప్పుడు పవన్ ఎంపిక చేసుకున్నారు. అధికారిక ప్రకటన విడుదల కాలేదు కానీ, దాదాపుగా ఇది ఫిక్స్ అనే చెప్పాలి. ఎందుకంటే పవన్ తన పొలిటికల్ టూర్ ని తిరుపతి నుంచే ప్రారంభిస్తున్నారు కనుక.

అవును, పవన్ కల్యాణ్ పొలిటికల్ టూర్ పై జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన చేశారు. అక్టోబర్-5న దసరా సందర్భంగా పవన్ కల్యాణ్ తిరుపతి నుంచి తన యాత్ర మొదలు పెడతారని ప్రకటించారు. ఆరు నెలల్లో అన్ని జిల్లాలు కవర్ చేస్తారని, ప్రతి జిల్లా కేంద్రంలో ఓ భారీ బహిరంగ సభ ఉంటుందని అన్నారు. నాన్ స్టాప్ గా పవన్ కల్యాణ్ 6 నెలలు పర్యటిస్తారని టాక్.

అంటే దాదాపుగా పవన్ పొలిటికల్ మూడ్ లోకి వచ్చేసినట్టే అనుకోవాలి. తిరుపతిని నియోజకవర్గంగా ఫిక్స్ చేసుకున్నారు కాబట్టి.. అక్కడి నుంచే తన యాత్ర మొదలు పెట్టబోతున్నారని తెలుస్తోంది.

ముందస్తు ముచ్చట..

చంద్రబాబు ముందస్తు ఎన్నికలకు కాచుకుకూర్చున్నట్టు, జనసేన కూడా ముందస్తు ముచ్చట తీర్చుకోవాలని ఉబలాటపడుతోంది. వచ్చే ఏడాది మార్చి లేదా, ఏప్రిల్ లో ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతాయని, జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్తారని నాదెండ్ల మనోహర్ చెబుతున్నారు. ఆ మేరకు జనసైనికులు సిద్ధంగా ఉండాలని కూడా పిలుపునిచ్చారు. ముందస్తు ఎన్నికలనాటికి పవన్ కల్యాణ్ పొలిటికల్ టూర్ పూర్తవుతుందని చెప్పారు నాదెండ్ల.

టూర్ సరే, ముందు పొత్తుల సంగతేంటని ప్రశ్నిస్తున్నారు కొంతమంది. టూర్ మొదలు పెట్టేలోగా, అసలు ఏ పార్టీకి ఓటు వేయాలో పవన్ కల్యాణ్ ఓ క్లారిటీ ఇస్తే బాగుంటుందనే వాదన వినపడుతోంది.