అన్న క్యాంటీన్లతో అనుకున్నంత రచ్చ చేశారు

మహానాడు సందర్భంగా అక్కడక్కడా అన్న క్యాంటీన్లు ఓపెన్ చేస్తే.. వైసీపీ లైట్ తీసుకుంది. ఇప్పుడు మంగళగిరిలో నాలుగు రోడ్ల కూడలిలో అన్న క్యాంటీన్ అంటూ హడావిడి చేసేసరికి కార్పొరేషన్ తీసిపారేసింది. నడిరోడ్డులో క్యాంటీన్ పెట్టి…

మహానాడు సందర్భంగా అక్కడక్కడా అన్న క్యాంటీన్లు ఓపెన్ చేస్తే.. వైసీపీ లైట్ తీసుకుంది. ఇప్పుడు మంగళగిరిలో నాలుగు రోడ్ల కూడలిలో అన్న క్యాంటీన్ అంటూ హడావిడి చేసేసరికి కార్పొరేషన్ తీసిపారేసింది. నడిరోడ్డులో క్యాంటీన్ పెట్టి రచ్చ చేసి, తీరా దాన్ని తీసేస్తే ఆ నెపం వైసీపీపై నెట్టేసి రాజకీయ లబ్ది పొందాలనుకోవడం టీడీపీ ఆలోచన. బాలయ్య పుట్టినరోజు సందర్భంగా దాన్ని పక్కాగా అమలు చేశారు.

ఎన్టీఆర్ జయంతి, వర్థంతి కార్యక్రమాలకి అన్నదానం చేయడం టీడీపీ నేతలకు అలవాటు. ఈరోజు బాలయ్య పుట్టినరోజు సందర్భంగా కూడా అన్నదానం చేశారు. అయితే మంగళగిరిలో అన్నదానం చేస్తూ దానికి అన్న క్యాంటీన్ అని పేరు పెట్టేశారు. 

నాలుగు రోడ్ల కూడలిలో అన్న క్యాంటీన్ ప్రారంభిస్తున్నామంటూ తాత్కాలిక నిర్మాణం ఏర్పాటు చేసే సరికి కార్పొరేషన్ అధికారులు, అక్రమ నిర్మాణాన్ని కూల్చి వేశారు. దీంతో పెద్ద రాద్ధాంతం మొదలైంది. ప్రతిపక్షం పేదలకు పట్టెడన్నం పెడుతుంటే, ప్రభుత్వం అడ్డుకుంటోందంటూ విమర్శలు మొదలయ్యాయి.

ఎందుకీ రాద్ధాంతం..

అధికారంలో నుంచి దిగిపోయే సమయంలో హడావిడిగా అన్న క్యాంటీన్లను ప్రారంభించింది టీడీపీ. ప్రభుత్వ స్థలాల్లో నిర్మాణాలు కనిపించాయి కానీ, క్యాంటీన్ లో నాసిరకం భోజనం పెట్టేవారని, ప్లేట్లు, గ్లాసులు కూడా సరిగా కడిగేవారు కాదనే ఆరోపణలు వచ్చాయి. ఆపై ఎన్నికలు జరిగాయి, అధికారంలోకి వచ్చిన వైసీపీ అన్న క్యాంటీన్లను మూసివేసింది. పేదలకు ఉచిత పథకాలు ఇస్తున్నందున, ప్రత్యేకంగా క్యాంటీన్లు పెట్టి మరీ వండి వార్చడం అవసరం లేదనుకున్నారు నాయకులు. ప్రజలనుంచి కూడా పెద్దగా వ్యతిరేకత లేదు.

కానీ టీడీపీ మాత్రం అన్న క్యాంటీన్లు తమ పేటెంట్ హక్కు అన్నట్టుగా ఓవర్ యాక్షన్ చేసింది. తీరా ఇప్పుడు ఎన్నికలకు రెండేళ్ల ముందుగా అన్నక్యాంటీన్లు తాము సొంతంగా ఓపెన్ చేస్తున్నామంటూ హడావిడి చేస్తున్నారు. ఎన్నారై నిధులతో అవి ఎన్నో రోజులు నడవవు, 

ఆ విషయం టీడీపీకి కూడా తెలుసు. కానీ ఈలోగా ఏపీలో అన్న క్యాంటీన్ల విషయంలో గొడవలు జరగాలి, ప్రభుత్వంపై దుమ్మెత్తిపోయాలి. ఇదీ చంద్రబాబు ఆలోచన. దాన్నిప్పుడు పక్కాగా అమలు చేస్తున్నారు. క్యాంటీన్ల పేరుతో రోడ్లను ఆక్రమించి మరీ నిబంధనలు ఉల్లంఘించి రచ్చ చేస్తున్నారు.