సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం.. మొత్తంగా దేశాన్ని కుదిపేసింది. ఇప్పటికీ అతడి మరణం ఓ మిస్టరీగానే మిగిలిపోయింది. ఈ కేసు విచారణ ఎన్ని మలుపులు తిరిగింది, ఎలా డ్రగ్స్ మలుపు తీసుకుందనే విషయం అందరికీ తెలిసిందే. ఈ సంగతి పక్కనపెడితే, ఇప్పుడు సుశాంత్ ఫ్లాట్ తెరపైకొచ్చింది.
ఏ ఫ్లాట్ లో సుశాంత్ సింగ్ చనిపోయాడో ఆ ఫ్లాట్ ఇంకా ఖాళీగానే ఉంది. అతడు మరణించి దాదాపు రెండున్నరేళ్లు అవుతున్నప్పటికీ ఇప్పటికీ ఆ ఫ్లాట్ లో దిగేందుకు ఎవ్వరూ ఆసక్తి చూపించడం లేదు.
ఆ ఫ్లాట్ సుశాంత్ ది కాదు. ఆ ఫ్లాట్ ఓనర్ ఓ ఎన్నారై. అతడికి నెలకు నాలుగున్నర లక్షలు అద్దె చెల్లిస్తూ, సుశాంత్ అందులో ఉండేవాడు. 4 బెడ్ రూమ్స్ తో, సముద్రం కనిపించేలా నిర్మించిన ఆ సువిశాలమైన ఫ్లాట్ లోకి వచ్చిన తర్వాత సుశాంత్ కు బాగా కలిసొచ్చిందని కూడా చెబుతారు కొంతమంది. అయితే అదే ఫ్లాట్ లో తనువు చాలించాడు ఈ హీరో.
సుశాంత్ మరణించిన తర్వాత ఇప్పటివరకు ఆ ఫ్లాట్ లో ఎవ్వరూ దిగలేదు. కొంతమంది రియల్ ఎస్టేట్ బ్రోకర్లు ఆ ఫ్లాట్ ను అద్దెకు ఇచ్చేందుకు ప్రయత్నించారు. అయితే ఎవ్వరూ కనీసం అటువైపు చూడలేదు. సుశాంత్ మరణించిన ఫ్లాట్ ను తీసుకునేందుకు ఆసక్తి చూపించలేదు. కొంతమంది బాలీవుడ్ సినీ ప్రముఖులు ఆ ఫ్లాట్ ను అద్దెకు తీసుకునేందుకు ముందుకొచ్చినప్పటికీ, ఆ ఎన్నారై ఓనర్ కు మాత్రం సినీజనాలకు ఫ్లాట్ అద్దెకివ్వడానికి ఇష్టంలేదు.
ఇలా ఏళ్లుగా సుశాంత్ ఫ్లాట్ ఖాళీగా ఉండిపోయింది. ఇప్పుడిప్పుడే కొంతమంది ఆ ఫ్లాట్ లో దిగేందుకు ఆసక్తి చూపిస్తున్నారట. కొంతమందికి ఫ్లాట్ నచ్చినప్పటికీ, ఇంట్లో పెద్ద వాళ్లు అంగీకరించకపోవడంతో వెనక్కి తగ్గుతున్నారట. ఈ ఫ్లాట్ ఎప్పుడు నిండుతుందో, ఎవరు ఇందులో దిగుతారో చూడాలి.