తిరుపతి లోక్ సభ నియోజకవర్గం ఉప ఎన్నికలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొన్ని తలనొప్పులు లేకపోలేదు. భారీ మెజారిటీని సాధించాలనే లక్ష్యంతో బరిలోకి దిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. గత సార్వత్రిక ఎన్నికలప్పుడు వచ్చిన మెజారిటీకి మించి సాధించాలని లెక్కలేస్తోంది. టార్గెట్ భారీగా పెట్టుకుంది. కనీసం మూడు లక్షల మెజారిటీని సాధించి తమ హవా తగ్గలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నిరూపించుకోవాల్సిన అవసరం అయితే చాలానే కనిపిస్తూ ఉంది.
ఇటీవలి స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండమైన విజయాన్నే పొందింది. అయితే ప్రతిపక్షాలు దాన్ని కూడా తక్కువ చేసే మాటలు మాట్లాడాయి. స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీకే ఎడ్జ్ ఉంటుందని, అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిందని కొంతమంది వైఎస్సార్సీపీ అంటే పడని మాటలు మాట్లాడారు. అయితే తెలుగుదేశం కంచుకోటల్లో కూడా స్థానిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెగ్గింది. ఆ విషయాన్ని తేలికగా తీసుకునే పరిస్థితి లేదు.
అయినప్పటికీ.. తిరుపతి ఎంపీ సీటు బై ఎలక్షన్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ విజయాన్ని సాధించాల్సిన అవసరం మాత్రం చాలానే ఉంది. మరి ఈ విషయంలో అధికార పార్టీకి కొన్ని ప్రతిబంధకాలు ఉన్నాయి. వాటిల్లో ఒకటి నేతల సహకారం లేకపోవడం.
ప్రత్యేకించి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే ఉన్నా.. ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీ యాక్టివిటీస్ లో అంత చురుకుగా ఉన్నారా? అనే ప్రశ్న తలెత్తుతోంది. వారిలో వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి, గూడురు ఎమ్మెల్యే వరప్రసాద్ ల విషయంలో చర్చ జరుగుతూ ఉంది.
ప్రత్యేకించి రామనారాయణ రెడ్డి పార్టీ కే కాదు, నియోజకవర్గానికి కూడా పెద్దగా అందుబాటులో లేరనే ప్రచారం కొన్నాళ్లుగా ఉంది. తనకు తగిన ప్రాధాన్యత దక్కడం లేదు అనే భావనలో ఆనం ఉన్నారని ఎన్నికల ఫలితాలు వచ్చిన కొన్నాళ్లలోనే ప్రచారం మొదలైంది. కాంగ్రెస్ పార్టీలో ఆనం సీనియర్. కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో కీలక నేతగా వెలిగారు. అప్పట్లో వైఎస్ జగన్ ను తీవ్రంగా విమర్శించిన వారిలో కూడా ఆనం ఉన్నారు.
రాష్ట్ర విభజన అనంతరం కొన్నాళ్లు కాంగ్రెస్ లో, ఆ తర్వాత టీడీపీకి వెళ్లి మరీ ఆనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. ఆఖరి నిమిషంలో వచ్చి గెలిచారు. ఆనం రామనారాయణ రెడ్డికి ఆ తర్వాత మంత్రి పదవి తరహాలో సత్కారం ఏదీ దక్కలేదు. ఇక ఇప్పుడు విధేయతను నిరూపించుకుని మంత్రి పదవి పొందే వయసు కూడా కాదు ఆయనది. ఈ నేపథ్యంలో ఆయనకూ పార్టీ అధిష్టానానికి దూరం పెరిగిందని ప్రచారం జరుగుతూ ఉంది.
అంతేగాక ఆనం రామనారాయణ రెడ్డి నియోజకవర్గానికి కూడా దూరంగా ఉంటున్నారనేది స్థానికంగా వస్తున్న ఫిర్యాదు. ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ ఆయన ఎవరికీ అందుబాటులో లేరని, హైదరాబాద్ లేదా నెల్లూరులోనే ఎక్కువగా ఉంటారనేది నియోజకవర్గం నుంచి వినిపిస్తున్న ఫిర్యాదు. ఆయన దర్శనం దక్కడమే కష్టం అవుతోందట.
ఈ నేపథ్యంలో ఈ వ్యవహారం ఉప ఎన్నికపై పడుతుందా? అనేది ఆసక్తిదాయకంగా మారింది. గత సార్వత్రిక ఎన్నికల్లో వెంకటగిరిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భారీ మెజారిటీ వచ్చింది. అలాంటి మెజారిటీలు నిలబెట్టుకుంటనే ఉప ఎన్నికలో మెజారిటీ మార్కు మూడు లక్షలను దాటే అవకాశం ఉంది. లేదంటే అంతే సంగతులు.
ఇక గుడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ కూడా గతంలో అంత యాక్టివ్ గా లేరు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తిరుపతి ఎంపీగా ఆయన గట్టిగానే నిలబడ్డారు. ఎమ్మెల్యేగా మాత్రం ఆయన రాజకీయ కార్యకలాపాల్లో మునుపటి ఉత్సాహంతో కనపడటం లేదు సామాన్య ప్రజలకు.
పార్టీ తరఫున ఆయన విధులను నిర్వర్తించవచ్చు. అయితే మెజారిటీ రావాలంటే.. ఎమ్మెల్యేలు ఎంతగా కసరత్తు చేయాలో వేరే వివరించనక్కర్లేదు! ఈ పరిణామాల మధ్యన తిరుపతి పోరులో వైఎస్ఆర్సీపీ అనే అంశం చర్చకు వచ్చినప్పుడు ఈ అంశాలు ప్రస్తావనకు వస్తున్నాయి.