హుజూరాబాద్ బ‌రిలో న‌లుగురు రాజేంద‌ర్‌లు

హుజూరాబాద్ ఉప ఎన్నిక‌ను అధికార పార్టీ టీఆర్ఎస్‌, అధికారంలోకి రావాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఉన్న బీజేపీ ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నాయి. మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ రాజీనామాతో హుజూరాబాద్‌కు ఉప ఎన్నిక అనివార్య‌మైంది. టీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి…

హుజూరాబాద్ ఉప ఎన్నిక‌ను అధికార పార్టీ టీఆర్ఎస్‌, అధికారంలోకి రావాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఉన్న బీజేపీ ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నాయి. మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ రాజీనామాతో హుజూరాబాద్‌కు ఉప ఎన్నిక అనివార్య‌మైంది. టీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి ఈట‌ల రాజేంద‌ర్ చేరారు. రాజేంద‌ర్‌నే త‌మ అభ్య‌ర్థిగా బీజేపీ బ‌రిలో దింపింది.

అయితే హుజూరాబాద్‌లో ఈట‌ల రాజంద‌ర్ సుదీర్ఘ కాలంగా రాజ‌కీయాలు చేస్తున్నారు. రాజేంద‌ర్‌కు జాతీయ‌స్థాయి అధికార పార్టీ బీజేపీ తోడైంది. బీజేపీ అభ్య‌ర్థిగా రాజేంద‌ర్ బ‌రిలో దిగ‌డంతో టీఆర్ఎస్ అనేక వ్యూహాలు ర‌చిస్తోంది. ఎలాగైనా గెలిచి తీరాల‌నే ప‌ట్టుద‌ల ఈట‌ల రాజేంద‌ర్‌లో క‌నిపిస్తోంది. దీంతో ఆయ‌న పాద‌యాత్ర కూడా నిర్వ‌హించారు.

ప్ర‌ధాన ప్ర‌త్య‌ర్థి బీజేపీని ఓడించేందుకు టీఆర్ఎస్ చిన్న అవ‌కాశాన్ని కూడా విడిచిపెట్ట‌డం లేదు. ఇందులో భాగంగా రాజేంద‌ర్ పేరుతో మ‌రో ముగ్గురితో నామినేషన్లు వేయించి కుట్ర‌ప‌న్నార‌ని బీజేపీ తీవ్ర ఆరోప‌ణ‌లు చేస్తోంది. ఒకే పేరుతో న‌లుగురు అభ్య‌ర్థులుంటే ఓట‌ర్లు గంద‌ర‌గోళానికి గురి అవుతార‌నేది ప్ర‌త్య‌ర్థుల ఎత్తుగ‌డ‌గా క‌నిపిస్తోంది.

హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్‌ నామినేషన్ వేసిన సంగ‌తి తెలిసిందే. అదే పేరున్న మ‌రో ముగ్గురిని ఇతర జిల్లాల నుంచి తీసుకొచ్చి నామినేషన్‌ వేయించ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. 

ఇప్పలపల్లి రాజేందర్‌ (ఆల్‌ ఇండియా బీసీ, ఓబీసీ పార్టీ), ఈసంపల్లి రాజేందర్‌ (న్యూ ఇండియా పార్టీ), ఇమ్మడి రాజేందర్‌ (రిపబ్లిక్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా) నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల ప‌రిశీల‌న‌లో ఇవి ఉంటాయా?  నిలుస్తాయా? అనేది ప్ర‌శ్న‌గా మిగిలింది. అయితే బీజేపీ గుర్తు ఓట‌ర్ల‌కు సుప‌రిచిత‌మ‌ని, ఎవ‌రైనా దాన్ని చూస్తే ఓట్లు వేస్తార‌ని ఆ పార్టీ నేత‌లు చెబుతున్నారు. ప్ర‌త్య‌ర్థుల కుట్ర‌లేవీ ప‌ని చేయ‌వ‌ని బీజేపీ నేత‌లు ధీమాగా ఉన్నారు.