పాలనలో మార్పులు రావాలి. ఎపుడూ ఒకేలా ఉండకూడదు. ఎందుకంటే పాలితుల ఆలోచన ధోరణులలో మార్పు వస్తోంది. పైగా సమాజం కూడా ఎప్పటికపుడు మారుతోంది. దీనిని గమనంలోకి తీసుకుని చాలా చోట్ల మారుతున్న వారున్నారు.
విశాఖ జిల్లా కలెక్టర్ మల్లికార్జున కూడా ఆ దిశగా వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. ప్రతీ సోమవారం విశాఖ సిటీలోని కలెక్టర్ ఆఫీసులో జరిగే స్పందన కార్యక్రమాన్ని ఆయన ఈసారి ఏజెన్సీ ముఖద్వారం అయిన నర్శీపట్నానికి మార్చారు.
స్పందనలో కలెక్టర్ కి వినతులు చేసుకోవడానికి ఏజెన్సీ నుంచి వందల కిలోమీటర్లు దాటి రాలేనివారి కోసమే కలెక్టర్ ఈ కొత్త ప్రయోగం చేసారు. దాంతో విశాఖ రూరల్ జిల్లాలోని మారుమూల ప్రాంతాలతో పాటు ఏజెన్సీ వాసులు కూడా నేరుగా తమ కష్టాలను జిల్లా పెద్దకు చెప్పుకునే చక్కని అవకాశాన్ని కల్పించారు.
పాలనా వికేంద్రీకరణకు కూడా కొత్త బాటలు వేశారు. దీనితో ఇటు ప్రజలతో పాటు మేధావులు సైతం కలెక్టర్ నిర్ణయాన్ని కొనియాడుతున్నారు.