దేశంలో కరోనా కేసుల సంఖ్య వేగంగా పెరుగుతూ ఉంది. ఇప్పటికే రోజువారీగా కేసుల సంఖ్య పెరుగుదల 50 వేల స్థాయిని దాటి పోయింది. లాక్ డౌన్ మినహాయింపులు మొదలైన దశలో రోజుకు వెయ్యి, రెండు వేల స్థాయిలో ఉండిన పెరుగుదల.. రెండు నెలలు గడిచే సరికి రోజుకు 50 వేల స్థాయిని దాటేసింది. ఏ రోజుకారోజు కేసుల సంఖ్య కొత్త నంబర్ ను చేరవవుతూ ఆందోళన రేపుతూ ఉంది. ఈ క్రమంలో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 17 లక్షలు దాటి పోయింది.
అయితే ఇందులో స్వల్ప ఊరట ఏమిటంటే.. గత ఇరవై నాలుగు గంటల్లో రికార్డు స్థాయిలో రికవరీలు చోటు చేసుకోవడం. దాదాపు 51,255 మంది 24 గంటల వ్యవధిలో రికవర్ అయ్యి, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయినట్టుగా తెలుస్తోంది. ఇప్పటి వరకూ రోజువారీ కేసుల సంఖ్య 50 వేలకు మించి నమోదు కావడం జరిగింది, ఇప్పుడు ఒకే రోజు ఆ స్థాయిలో రికవరీలు చోటు చేసుకోవడం స్వల్ప ఊరట అని చెప్పవచ్చు.
మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ రాష్ట్రాల్లో కొత్త కేసుల సంఖ్య కన్నా రికవరీల సంఖ్య పెరగడంతో.. ఒకే రోజు రికవరీల సంఖ్య 50 వేలను దాటింది. ఈ స్థాయిలో భారీ రికవరీలు చోటు చేసుకోవడంతో యాక్టివ్ కేసుల లోడ్ ఈ రాష్ట్రాల్లో తగ్గింది. అయితే దేశం మొత్తం మీదా చూసుకుంటే.. రికవరీలు 50 వేలను దాటినా, ఇరవై నాలుగు గంటల్లో యాక్టివ్ కేసుల సంఖ్య రెండు వేల స్థాయిలో పెరిగింది. రోజువారీ రికవరీల సంఖ్య పెరిగి, యాక్టివ్ కేసుల సంఖ్య తగ్గే పరిస్థితి ఏర్పడితే మాత్రం.. కరోనా పై భారత దేశం విజయం దిశగా సాగే అవకాశాలున్నాయి.