ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల బిల్లులకు గవర్నర్ ఆమోద ముద్ర వేయడం, మరోవైపు అమరావతి రైతుల ఆందోళన…వెరసి రాజకీయంగా దుమారం రేపుతోంది. ఈ నేపథ్యంలో నేటి అమరావతి రైతుల కష్టాలకు, కన్నీళ్లకు నాటి ముఖ్య మంత్రి చంద్రబాబునాయుడు అనుసరించిన లోపభూయిష్ట విధానాలే కారణమని జనసేనాని పవన్‌కల్యాణ్ మరోసారి స్పష్టం చేసిన విషయం తెలిసిందే. రైతులతో నాటి ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం సరైంది కాదని మొట్టమొదట మాట్లాడింది తానేనని పవన్ పేర్కొన్న విషయం తెలిసిందే.
రాజధాని అమరావతి విషయంలో తమ్ముని బాటనే అన్న నాగబాబు కూడా అనుసరించారు. జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ టెలీ కాన్ఫరెన్స్‌లో నాగబాబు మాట్లాడుతూ ప్రభుత్వమే మోసం చేస్తోందని, ఈ పరిస్థితి ఉత్పన్నం కావడానికి ప్రధాన కారకులు చంద్రబాబు నాయుడేనని విమర్శించారు. ఆనాడు చంద్రబాబు చేసిన తప్పులను నేడు జగన్ తనకు అనుకూలంగా మార్చుకొని రాజధాని తరలించుకెళుతున్నారని నాగబాబు విమర్శించారు.
రాజధాని విషయంలో మొదటి నుంచి ఒకే విధానం, ఒకే మాట మీద ఉన్నది జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మాత్రమేనని నాగబాబు స్పష్టం చేశారు. వేలాది ఎకరాల భూమిని సమీకరిస్తే భవిష్యత్‌లో ఏదైనా సమస్య వస్తే రైతులకు భరోసాగా ఎవరు ఉంటారని 2015లోనే పవన్ కల్యాణ్ ప్రశ్నించారని నాగబాబు గుర్తు చేశారు. ప్రభుత్వంతో ఒప్పందం మేరకు రైతులు భూములు ఇచ్చారని, ఇప్పుడు రాజధాని తీసుకెళ్లిపోతే బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అవుతుందన్నారు. మొత్తానికి అన్నదమ్ములిద్దరూ చంద్రబాబును దుమ్ము లేపుతాండారు.