రోజురోజుకూ ఆక‌ట్టుకుంటున్న‌ సీఎం

త‌మిళ‌నాడు సీఎం ఎంకే స్టాలిన్ గురించి రెండు ర‌కాలుగా చెప్పుకుంటారు. ఒక‌టి ఆయ‌న సీఎం కాక‌ముందు, రెండోది సీఎం అయిన త‌ర్వాత అని చ‌ర్చించుకుంటున్నారు. నిజానికి స్టాలిన్‌పై త‌మిళ‌నాడు ప్ర‌జ‌ల‌కు ఎన్నిక‌ల‌కు ముందు పెద్ద…

త‌మిళ‌నాడు సీఎం ఎంకే స్టాలిన్ గురించి రెండు ర‌కాలుగా చెప్పుకుంటారు. ఒక‌టి ఆయ‌న సీఎం కాక‌ముందు, రెండోది సీఎం అయిన త‌ర్వాత అని చ‌ర్చించుకుంటున్నారు. నిజానికి స్టాలిన్‌పై త‌మిళ‌నాడు ప్ర‌జ‌ల‌కు ఎన్నిక‌ల‌కు ముందు పెద్ద న‌మ్మ‌కం లేదు. కానీ త‌మిళ‌నాడులో జ‌య‌ల‌లిత మ‌ర‌ణానంత‌రం నెల‌కున్న రాజ‌కీయ అస్థిర‌త నేప‌థ్యంలో ఆయ‌న విజ‌యం ప్రాధాన్యం సంత‌రించుకుంది.

అలాగ‌ని ఆయ‌న‌కు జ‌గ‌న్‌కు మ‌ల్లే భారీ విజ‌యాన్ని క‌ట్ట‌బెట్ట‌లేదు. బ‌హుశా సీఎంగా అంద‌రి ప్ర‌శంస‌లు అందుకునేలా పాలించడానికి ఇది కూడా ఒక కార‌ణ‌మై ఉంటుంద‌ని చెబుతున్నారు. తాజాగా మరో ప్ర‌శంసనీయ‌మైన మాట స్టాలిన్ అన్నారు.

ప్రభుత్వాన్ని పొగడ్తలతో ముంచెత్తేలా వార్తలు, కథనాలు ప్రచురించాలని నేను ఎన్నడూ ఆదేశించలేదు. ప్రభుత్వ పథకాల్లో లోటు పాట్లు ఉంటే ఎత్తి చూపించండి. వాటిని సరి చేసుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని  సీఎం ఎంకే స్టాలిన్ కోర‌డం స‌ర్వ‌త్రా హ‌ర్షం వ్య‌క్త‌మ‌వుతోంది. 

క‌క్ష‌పూరిత రాజ‌కీయాల‌కు త‌మిళ‌నాడుపెట్టింది పేరు. క‌రుణానిది, జ‌య‌ల‌లిత మ‌ధ్య సాగిన విద్వేష‌పూరిత రాజ‌కీయాల‌తో త‌మిళ‌నాడు ప్ర‌జ‌లు విసిగిపోయారు. ఇప్పుడు జ‌య‌ల‌లిత‌, క‌రుణానిది ఇద్ద‌రూ జీవించిలేరు. క‌రుణానిధి కుమారుడు స్టాలిన్ ప్ర‌స్తుతం త‌మిళ పాల‌కుడు. తండ్రి నుంచి సుగుణాల‌నే త‌ప్ప‌, చెడు సంప్ర‌దాయాల‌ను స్టాలిన్ స్వీక‌రించ‌లేదు. 

ప్ర‌త్య‌ర్థులను రాజ‌కీయ‌వంగా వేధించాల‌నే ఆలోచ‌న చేయ‌లేదు. దీంతో స్టాలిన్ అంద‌రివాడ‌య్యారు. త‌న‌ను పొగ‌డొద్ద‌ని, లోపాల గురించి చెబితే స‌రిదిద్దుకుంటాన‌ని మీడియాకు విన్న‌వించ‌డం ఆయ‌న‌లోని విజ్ఞ‌త‌కు నిద‌ర్శ‌న‌మ‌ని ప‌లువురు అభిప్రాయ‌ప‌డుతున్నారు. 

ఇలాంటి ధోర‌ణి రాజ‌కీయ నాయ‌కుల్లో పెరిగితే మంచి స‌మాజం ఏర్ప‌డుతుంద‌నే అభిప్రాయాలు సోష‌ల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి. మంచి పాల‌కుడిగా స్టాలిన్ చాలా త‌క్కువ కాలంలోనే గుర్తింపు పొంద‌డం విశేషం.