బద్వేల్ ఉప ఎన్నికలో తెలుగుదేశం పార్టీ పోటీ నుంచి తప్పుకోవడంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పందన ఆసక్తిదాయకంగా ఉంది. మానవీయ కోణం తాము పోటీ నుంచి తప్పుకున్నట్టుగా టీడీపీ చెప్పుకొచ్చింది. అయితే చేతగాక చేతులెత్తేశారని అంటోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.
ఏపీ మంత్రి కొడాలి నాని ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. బద్వేల్ పోరు నుంచి టీడీపీ తప్పుకోవడం కేవలం చేతగాని తనమే తప్ప త్యాగమేది లేదన్నట్టుగా కొడాలి నాని స్పష్టం చేశారు.
తాము పోటీ చేయకపోవడానికి త్యాగం కలరింగ్ ఇవ్వాలని టీడీపీ అనుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం అంత సీన్ లేదని ఇలా ఘాటుగా స్పందిస్తూ ఉంది. నిజానికి తెలుగుదేశం పార్టీ ముందే ఈ ప్రకటన చేయలేదు.
బద్వేల్ కు ఉప ఎన్నిక ఖరారు అయిన సమయంలోనే తాము అభ్యర్థిని పోటీ పెట్టడం లేదు అని ప్రకటించి ఉంటే అదో ఎత్తు. అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా టీడీపీని ఏమనడానికి వీలుండేది కాదు.
ముందుగా టీడీపీ బద్వేల్ ఉప ఎన్నికకు అభ్యర్థిని ప్రకటించింది.ఆ అభ్యర్థిని ప్రచారం చేసుకోమని చెప్పింది. ఇక బద్వేల్ ఉప ఎన్నిక షెడ్యూల్ ను సీఈసీ విడుదల చేసిన తర్వాత కూడా టీడీపీ స్పందించింది. అక్కడ తమ పార్టీ అభ్యర్థి పోటీలో ఉంటాడంటూ ప్రకటించుకుంది. అభ్యర్థి పేరును కూడా ప్రస్తావించింది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో బద్వేల్ లో టీడీపీ పోటీ చేస్తే కనీసం డిపాజిట్ దక్కడం కూడా కష్టమే అనే అభిప్రాయాలు సర్వత్రా వినిపించాయి.
పోటీ చేసి డిపాజిట్ పోగొట్టుకోవడం కన్నా త్యాగం అనే ప్రచారాన్ని పొందడానికి టీడీపీ ప్రయత్నాలు ప్రారంభించింది. అప్పుడు ఆ పార్టీకి మానవీయ కోణం గుర్తుకువచ్చింది. మానవీయకోణంలో తాము పోటీ నుంచి తప్పుకుంటున్నట్టుగా టీడీపీ కొత్త కథ అల్లింది. మరి నిజంగా ఆ రేంజ్ లో మానవత్వం ఉట్టిపడి ఉంటే.. మొదటే పోటీ నుంచి టీడీపీ తప్పుకునేది.
పవన్ కల్యాణ్ పోటీ నుంచి తప్పుకున్న ప్రకటన చేసిన తర్వాత టీడీపీ అదే రూటును ఫాలో అయ్యి, తప్పుకుంది. ఇదంతా ఎవరికీ అర్థం కాని కథేం కాదు. అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా.. అది త్యాగం కాదు, చేతులెత్తేయడం అని బాహాటంగానే వ్యాఖ్యానించగలుగుతోంది.