తెలంగాణా సీఎం కేసీఆర్ గారాలపట్టీ, తెలంగాణాకు బతుకమ్మ అయిన కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీ పదవీకాలం అయిపోవొస్తోందా? చాలా ఆశ్చర్యంగా ఉంది కదూ. ఆమె నిన్న మొన్న ఎమ్మెల్సీ అయినట్లు అనిపిస్తోంది. కానీ ఆమె పదవీకాలం మరో మూడు నెలల్లో ముగిసిపోతుంది.
వచ్చే ఏడాది జనవరిలో కవిత టర్మ్ ముగుస్తుంది. ఆ తరువాత ఏం చేస్తుందనేది తెలియదు. ఎమ్మెల్సీ పదవి అంటే ఆరేళ్ళు ఉంటుంది. కానీ కవిత ఎమ్మెల్సీగా గెలిచింది ఉప ఎన్నికలో. ఆమె నిజామాబాద్ జిల్లా నుంచి స్థానిక సంస్థల కోటాలో ఖాళీ అయిన స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో గెలిచింది. అందుకే ఆమె పదవీకాలం చాలా త్వరగా ముగిసి పోతున్నది.
ఆమె అక్టోబర్ 2020లో జరిగిన శాసనమండలి ఎన్నికల్లో నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికలో పోటీ చేసి 672 ఓట్ల మెజారిటీతో ఎమ్మెల్సీగా గెలిచింది. తెలంగాణా రాష్ట్రం ఏర్పడగానే నిజామాబాద్ నుంచి ఎంపీగా గెలిచిన కవిత రెండోసారి ధర్మపురి అరవింద్ చేతిలో భారీ ఓట్ల తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే కదా.
ఓడిపోయాక చాలా కాలం ఏం పట్టించుకోకుండా మౌనంగా ఉండిపోయింది. ఎప్పటిదాకా అలా ఉందంటే ఎమ్మెల్సీగా గెలిచేంతవరకు. నిజామాబాద్ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులంతా అధికార పార్టీ వారే కాబట్టి కవిత చాలా సులభంగా శాసనమండలిలో అడుగుపెట్టింది.
ఎంపీగా పోటీచేసి ఓడిపోయిన తరువాత తండ్రి కేసీఆర్ ..తన కూతురును చట్టసభల్లోకి ఎలాగైనా పంపాలనే ఉద్దేశంతో అప్పటికప్పుడు ఏ పదవీ లేని కవితను మండలికి పంపించారు. అంతకుముందు అక్కడ ఎమ్మెల్సీగా ఉన్న భూపతి రెడ్డిపై అనర్హత వేటు పడటంతో ఈ ఎన్నిక నిర్వహించారు.
భూపతిరెడ్డి 2016 జనవరిలో జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్సీగా విజయం సాధించారు. కానీ ఆ తరువాత ఆయనమీద అనర్హత వేటు పడింది. కవిత రాజకీయ భవిష్యత్తుపై పార్టీలో అప్పుడే చర్చలు మొదలయ్యాయి. కేసీఆర్ ఏం చేయబోతున్నారో అని ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.
తరువాత జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ పోటీచేయాలని కూతురును కోరుతారా? లేక వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు ఖాళీగా ఉంచి పోటీ చేయిస్తారా ? లేదనుకుంటే లోక్ సభ ఎన్నికల్లో పోటీచేయిస్తారా? కేసీఆర్ ఏం నిర్ణయం తీసుకుంటారో మరి.
కవిత ఆస్తులపై సమగ్ర విచారణ జరిపించాలంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు కాంగ్రెస్ నేత బక్క జడ్సన్ గత నెలలో ఫిర్యాదు చేశారు. కవిత 2014లో లోక్‌సభ ఎన్నికల్ పోటీచేసినప్పటి నుంచి ఆమె స్థిరాస్తులు, చరాస్తులు, కంపెనీల్లో పెట్టుబడులు భారీగా పెరిగిపోయాయని జడ్సన్ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వివరాలను ఆయన ఈడీకి సమర్పించారు. కవిత భర్తకు సంబంధించిన పెట్టుబడులు, పలు కంపెనీల్లో ఉన్న పదవుల గురించి వివరాలు అందించారు.
ఈ ఏడేళ్ళ కాలంలో ఎక్కడెక్కడ ఎంతెంత వ్యవసాయ భూములు, నివాస స్థలాలు కొనుగోలు చేశారో, ప్రస్తుతం వాటి మార్కెట్ విలువ ఎంత ఉందో కూడా ఆ ఫిర్యాదుతో జతచేశారు. తెలంగాణ ఏర్పడడానికి ముందు కేవలం తెలంగాణ జాగృతి సంస్థ ద్వారా మాత్రమే కవిత ప్రజలకు పరిచయమని, తండ్రి ముఖ్యమంత్రి అయ్యాక అధికారాన్ని అడ్డం పెట్టుకుని కోట్లాది రూపాయలను పోగుచేసుకున్నారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈడీ చొరవ తీసుకుని దర్యాప్తు చేస్తే కవిత అక్రమాస్తులు వెలుగులోకి వస్తాయని జడ్సన్ అన్నారు. దీనికి సంబంధించి జూలై 10న ఈడీకి ఫిర్యాదు చేసినా ఎలాంటి స్పందన లేదని, అందుకే మరోసారి ఫిర్యాదు చేస్తున్నట్లు జడ్పన్ తెలిపారు. కవిత తనపదవీకాలం పూర్తయ్యాక మళ్ళీ తెర వెనక్కి వెళ్లిపోతుందా? రాజకీయంగా యాక్టివ్ గా ఉంటుందా ?