బంగాళాఖాతంలో ఏర్పడిన మాండూస్ తుపాన్ దెబ్బతో రైతాంగం విలవిలలాడుతోంది. ఈ తుపాను ప్రభావంతో ముఖ్యంగా ఉమ్మడి చిత్తూరు, కడప, నెల్లూరు, అనంతపురం జిల్లాల్లో రైతాంగం విలవిలలాడుతోంది. ఖరీఫ్ కింద సాగు చేసిన శనగ, పత్తి, మినుము, కుసుమ, చిక్కుడు, అలాగే అరటి, బొప్పాయి తదితర పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో పంటలన్నీ నల్లబారాయి.
పూత రాలి, దిగుబడిపై భారీ దెబ్బ పడింది. అరటి చెట్లు విరిగి నేలకూలడంతో భారీ నష్టం వాటిల్లినట్టు రైతులు వాపోతున్నారు. చేతికి దిగుబడి వచ్చే సమయంలో మాండూస్ తుపాను చావు దెబ్బ తీసిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా వుండగా ప్రభుత్వం మాత్రం వెయ్యి, రెండు వేల రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకుంటోందని రైతులు వాపోతున్నారు.
నష్టపరచడానికి మాండూస్ తుపాను చాలదన్నట్టు… రెండు రోజుల్లో మోగా అనే తుపాను విరుచుకుపడనున్నట్టు వాతావరణశాఖ వెల్లడించింది. దీంతో రైతులు తీవ్ర భయాందోళనకు గురి అవుతున్నారు. బంగాళాఖాతంలో కొత్తగా ఏర్పడే తుపానుకు మోగా అనే పేరు ఖరారు చేశారు. ఈ తుపాను ప్రభావంతో తమిళనాడులో భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని వాతావరణ శాఖ వెల్లడిస్తోంది.
తమిళనాడు అంటే ఆంధ్రాపై తప్పక ప్రభావం చూపుతుంది. తాజా తుపాన్లతో రైతాంగం పచ్చ కరువుకు గురి కావాల్సి వస్తోంది. ప్రభుత్వం వెంటనే అప్రమత్తమై పంట నష్టాన్ని అంచనా వేయడం, బీమా సంస్థల నుంచి పరిహారం అందేలా చేసేందుకు చర్యలు తీసుకోవాలని రైతాంగం కోరుతోంది.