తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై ఆ రాష్ట్ర బీజేపీ విరుచుకుపడుతోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవిత స్టేట్‌మెంట్‌ను సీబీఐ రికార్డ్ చేస్తున్న నేపథ్యంలో బీజేపీలో ఉత్సాహం నెలకుంది. ఈ పరిణామాలను బీజేపీ తనకు అనుకూలంగా మలుచుకునేందుకు ప్రయత్నిస్తోంది. బీఆర్ఎస్‌ను అవినీతి పార్టీగా ప్రజల్లో చులకన చేసే ప్రయత్నాన్ని వేగవంతం చేస్తోంది. ఈ నేపథ్యంలో కేసీఆర్, బీఆర్ఎస్ నేతలపై విమర్శల తీవ్రతను బీజేపీ పెంచింది.
ఈ నేపథ్యంలో కేసీఆర్ ఢిల్లీ పర్యటనను పురస్కరించుకుని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి ఆయనపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం. బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ చెల్లని రూపాయిగా అభివర్ణించారు. బీఆర్ఎస్ పేరుతో కుట్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు. సమైక్య నినాదాన్ని తెరపైకి తెచ్చి లబ్ధి పొందాలని చూస్తున్నారని ఆరోపించారు.
కేసీఆర్ రాజశ్యామల యాగం చేసినా ఏ దేవుడూ కాపాడలేరని చెప్పుకొచ్చారు. స్వార్థం కోసమైతే ఇంట్లోనే యాగం చేసుకోవాలని ఆయన హితవు పలికారు. ఢిల్లీలో యాగం చేసేటప్పుడు దేవుని సాక్షిగా తెలంగాణలో ఏం చేశారో చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. కేసీఆర్ యాగాలు చివరికి ఆయనకే తిప్పి కొడ్తాయని హెచ్చరించారు.
లిక్కర్ స్కామ్‌తో కవితకు సంబంధం లేదని చెప్పాలని డిమాండ్ చేశారు. కవితను సీబీఐ విచారించడంపై కేసీఆర్ ఎందుకు స్పందించలేదని ఆయన ప్రశ్నించారు. సీబీఐ విచారణకు కవిత సహకరించాలని ఆయన కోరారు. దేశంలో ఏం జరిగినా సీబీఐ వస్తుందని ఆయన తేల్చి చెప్పారు.