పార్టీ మార్పుపై టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ మార్పుపై మీడియానే రకరకాల ముహూర్తాలు పెడుతూ వార్తలు రాసింది, రాస్తోందని చెప్పుకొచ్చారు. తానెప్పుడూ పార్టీ మారుతానని చెప్పలేదన్నారు. కానీ పార్టీ మారాల్సిన పరిస్థితి వస్తే… మీడియాకు తానే స్వయంగా తప్పక చెబుతానని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ మారనని మాత్రం ఆయన చెప్పక పోవడం గమనార్హం.
టీడీపీ తరపున గెలిచినప్పటికీ, ఆ పార్టీ అధికారంలోకి రాకపోవడంతో గంటా శ్రీనివాసరావు మౌనాన్ని ఆశ్రయించారు. గతంలో టీడీపీ హయాంలో ఆయన మంత్రిగా పని చేశారు. విశాఖ నుంచి 2019లో గెలిచిన తర్వాత టీడీపీ కార్యక్రమాలకు దూరంగా వుంటున్నారు. రాజకీయంగా ఆయన ఎక్కడా కనిపిస్తున్న దాఖలాలు లేవు. వైసీపీలో చేరుతారని విస్తృత ప్రచారం సాగుతోంది. ఎప్పుడూ ఆయన ఆ వార్తల్ని ఖండించిన దాఖలాలు లేవు.
విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరించాలనే నిర్ణయానికి వ్యతిరేకంగా ఎమ్మెల్యే పదవికి ఆయన రాజీనామా చేశారు. దాన్ని ఆమోదించలేదు. ఏడాదిన్నరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మళ్లీ ఆయన పొలిటికల్‌గా యాక్టీవ్ అవుతున్నారు. ఈ నెల 26న విశాఖలో నిర్వహించనున్న కాపునాడు బహిరంగ సభ పోస్టర్‌ను ఆయన ఇవాళ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివంగత వంగవీటి రంగా వర్ధంతిని పురస్కరించుకుని కాపునాడు బహిరంగ సభ నిర్వహిస్తున్నారని, అన్ని రాజకీయ పార్టీల నేతల్ని ఆహ్వానిస్తున్నట్టు గంటా తెలిపారు. కాపులకు సంబంధించిన సమావేశం కావడంతో జనసేనకు మద్దతుగా కీలక నిర్ణయం తీసుకునే అవకాశం వుంది.
అయితే జనసేన అధికారంలోకి వచ్చే సూచనలు లేకపోవడంతో గంటా నిర్ణయం ఏంటనేది చర్చనీయాంశమైంది. రానున్న రోజుల్లో రాజకీయ పరిణామాలను బట్టి గంటా నిర్ణయం వుంటుందని చెప్పొచ్చు. టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య లేదా బీజేపీతో సంబంధం లేకుండా ఆ రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరినా గంటా తానున్న పార్టీ నుంచే పోటీ చేసే అవకాశం వుందనే టాక్ వినిపిస్తోంది.