తను మోజు పడి తయారు చేయించుకున్న వాహనం నిబంధనలకు అనుగుణంగా లేదని ఆంధ్రలో నాయకులు అనేసరికి చిర్రెత్తుకు వచ్చింది పవర్ స్టార్..జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ కు. ఆ కోపంలో, ఆయన భాషలో చెప్పాలంటే ఆ తిక్కలో ఓ రోజంతా ఏవేవో ట్వీట్ లు వేసారు.
ఓ పార్టీ అధినేతను అని మరిచిపోయారు. తన చిత్తానికి ట్వీట్ లు వేసుకుంటూ పోయారు. ఈ చొక్కా వేసుకోవచ్చా..ఈ రంగు ఓకె నా, ఇలా చిన్న పిల్లాడి మాదిరిగా, జనం నవ్వుకున్నారు. ఓ పార్టీ అధినేతకు ఎంతటి హుందాతనం వుండాలి. మాట అన్నా, ట్వీట్ వేసినా దానికి ఎంత పవర వుండాలి. ఇవన్నీ మరిచిపోయి ఈ చిల్లరి ఆటలేంటీ అనుకున్నారు. ఆయన ఫ్యాన్స్ కు అలాగే వుండాలేమో..అలాగే ప్రవర్తించాలేమో అని సరిపెట్టుకున్నారు.
ఇప్పుడు అదే వాహనాన్ని తెలంగాణలో రిజిస్ట్రేషన్ కు పంపారు. కానీ అక్కడ కూడా పాపం చుక్కెదురు అయింది. అధికారుల ఎవరైనా నిబంధనలకు అనుగుణంగానే వెళ్తారు. ఇదేమీ తన వాహనానికి 9999 లేదా 1111 నెంబర్ తెచ్చుకోవడం లాంటిది కాదు కదా. అది అయితే తెర వెనుక అనేక మార్గాలు వుంటాయి. ముందే బిడ్ అమౌంట్లు తెలుసుకుని, వాటి కన్నా ఓ రూపాయి ఎక్కువ వేసి సంపాదించేస్తారు. ఇక్కడ అలా కాదు కదా రూల్స్ పాటించాలి. ఇదేమీ కారుకు వద్దు అన్న బ్లాక్ ఫిలిం వాడేయడం లాంటిది కాదు కదా. పోలీసులు ఆపితే ఫైన్ కట్టేయడానికి. అంతే కానీ నిబంధన పాటించాలన్న జ్ఙానం వుండదు.
పెద్ద జెయింట్ వెహికిల్ తయారు చేయించుకునేటపుడే ఆలోచించాలి. అది రూల్స్ కు విరుద్దమా? కాదా? అన్నది. దానికి టైర్లు బిగించేటపుడే అడగాలి. ఒకె. నా కాదా? అని. రంగు వేసేటపుడే కంపెనీ వాడిని అడిగితే చెప్పేవాడు రూల్స్ ఇవీ అని. ఇప్పుడు ఏమయింది. ఆంధ్రలో అయితే జగన్ ను ఆడిపోసుకునేవారు. కావాలని అనుమతి ఇవ్వలేదు అని. కానీ తెలంగాణలో అప్లయ్ చేసారు. వెనక్కు వెళ్లి పని చూసుకోమన్నారు. రూల్స్ పాటించి రమ్మన్నారు. దాంతో గమ్మున వున్నారు.
అంతే తప్ప ఈ రోజంతా కేసిఆర్ మీదో, కేటిఆర్ మీదో ట్వీట్ లు వేసుకుంటూ కూర్చునేంత సీన్ లేదు. తోకలు కట్టయిపోతాయి. అందుకే సైలంట్ గా వాహనం షెడ్లో పెట్టి, తాము ఇంట్లో కూర్చున్నారు. ట్వీట్ లు లేవు. కౌంటర్లు లేవు. బుద్దిగా కూర్చున్నారు. జగన్ కాదు కదా ఇక్కడ వున్నది కేసీఆర్. ఒంటికాలి మీద లేచిపోయి, తిక్క తిక్క ట్వీట్ లు వేసేంత దమ్ము వుండదు.