హీరో రామ్ చరణ్ తండ్రి కాబోతున్నాడు. రామ్ చరణ్ భార్య ఉపాసన త్వరలోనే ఓ బిడ్డకు జన్మనివ్వబోతోంది. ఈ విషయాన్ని చరణ్ తండ్రి, ఉపాసన మామ చిరంజీవి ట్విట్టర్ లో స్వయంగా వెల్లడించారు.
“శ్రీ హనుమాన్ ఆశీస్సులతో.. ఉపాసన-రామ్ చరణ్ తమ తొలి సంతానాన్ని స్వాగతించబోతున్నారు.” అంటూ చిరంజీవి ప్రకటించారు. మెగాస్టార్ ప్రకటనతో మెగాఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.
పదేళ్ల కిందటే రామ్ చరణ్, ఉపాసన పెళ్లయింది. అప్పట్నుంచి ఇప్పటివరకు వాళ్లు సంతానంపై పెద్దగా ఆసక్తి చూపించలేదు. దీనిపై పలుమార్లు చిరంజీవి కూడా స్పందించారు. చరణ్ కు బాబు లేదా పాప పుడితే చూసి సంతోషించాలని, వాళ్లతో ఆడుకోవాలని ఉందన్నారు.
ఇదే అంశంపై గతంలో ఉపాసన, చరణ్ కూడా స్పందించారు. పిల్లల్ని ఎప్పుడు కనాలనేది పూర్తిగా తమ వ్యక్తిగత విషయమని, దానికి ఇంకా చాలా టైమ్ ఉందని స్పందించారు. టైమ్ వచ్చినప్పుడు కచ్చితంగా ఆ శుభవార్తను అందరితో షేర్ చేసుకుంటామని కూడా తెలిపారు.
మొత్తానికి ఆ టైమ్ రానే వచ్చింది. చిరంజీవి కోరిక నెరవేరబోతోంది. పెళ్లయిన పదేళ్లకు ఉపాసన తల్లి కాబోతోంది. ప్రస్తుతం టాలీవుడ్ లో ఇదే హాట్ టాపిక్ గా మారింది.