హ‌త్య కేసులో ఎమ్మెల్సీకి ఊర‌ట‌

డ్రైవ‌ర్ హ‌త్య కేసులో వైసీపీ స‌స్పెన్ష‌న్‌కు గురైన ఎమ్మెల్సీ అనంత‌బాబుకు ఎట్ట‌కేల‌కు సుప్రీంకోర్టులో ఊర‌ట ల‌భించింది. ష‌ర‌తుల‌తో కూడిన బెయిల్ ఆయ‌న‌కు ద‌క్కింది. ఈ ఏడాది మే 19న డ్రైవ‌ర్ సుబ్ర‌హ్మ‌ణ్యం హ‌త్య‌కు గురైన…

డ్రైవ‌ర్ హ‌త్య కేసులో వైసీపీ స‌స్పెన్ష‌న్‌కు గురైన ఎమ్మెల్సీ అనంత‌బాబుకు ఎట్ట‌కేల‌కు సుప్రీంకోర్టులో ఊర‌ట ల‌భించింది. ష‌ర‌తుల‌తో కూడిన బెయిల్ ఆయ‌న‌కు ద‌క్కింది. ఈ ఏడాది మే 19న డ్రైవ‌ర్ సుబ్ర‌హ్మ‌ణ్యం హ‌త్య‌కు గురైన విష‌యం తెలిసిందే.  మృత‌దేహాన్ని ఇంటికి తీసుకెళ్లి కుటుంబ స‌భ్యుల‌కు అనంత‌బాబు అప్ప‌గించారు. హ‌త్య చేయ‌డ‌మే కాకుండా డెడ్ బాడీని డోర్ డెల‌వ‌రీ చేస్తారా?  జ‌గ‌న్ ప్ర‌భుత్వ పాల‌న‌కు ఇదే నిద‌ర్శ‌నం అంటూ ప్ర‌త్య‌ర్థులు తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు.

ఈ నేప‌థ్యంలో అత‌న్ని వైసీపీ నుంచి సస్పెండ్ చేశారు. అలాగే హ‌త్య జ‌రిగిన ఐదు రోజుల‌కు అత‌న్ని పోలీసులు అరెస్ట్ చేశారు. దాదాపు ఏడు నెల‌లుగా అనంత‌బాబు జైల్లోనే గ‌డుపుతున్నాడు. ఆ మ‌ధ్య త‌ల్లి మృతి చెందిన సంద‌ర్భంలో అనంత‌బాబు మ‌ధ్యంత బెయిల్‌పై ఇంటికెళ్లారు. ఆ త‌ర్వాత తిరిగి జైలుకు వెళ్లాడు. అప్ప‌టి నుంచి బెయిల్ కోసం అత‌ను పోరాడుతున్నాడు.

రాజ‌మండ్రిలోని ఎస్సీ, ఎస్టీ కోర్టు, ఏపీ హైకోర్టు అత‌ని బెయిల్ పిటిష‌న్లు కొట్టి వేసిన సంగ‌తి తెలిసిందే. తాజాగా ఆయ‌న స‌ర్వోన్న‌త న్యాయ‌స్థాన‌మైన సుప్రీంకోర్టును ఆశ్ర‌యించాడు. అక్క‌డ అత‌నికి ఉప‌శ‌మ‌నం ల‌భించింది. ష‌ర‌తుల‌తో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ష‌ర‌తుల‌ను ట్రెయిల్ కోర్టు విధిస్తుంద‌ని  సుప్రీంకోర్టు పేర్కొన‌డం గ‌మ‌నార్హం. ఇదిలా వుండ‌గా సుప్రీంకోర్టు ప్ర‌తివాదుల‌కు నోటీసులు జారీ చేసింది.

ఈ కేసు త‌దుప‌రి విచార‌ణ‌ను వ‌చ్చే ఏడాది మార్చి 14కు వాయిదా వేసింది. బెయిల్‌పై విడుద‌ల కానున్న అనంత‌బాబు విష‌యంలో వైసీపీ ఎలా వ్య‌వ‌హ‌రిస్తుంద‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది. ద‌ళితుడి హ‌త్య కేసు కావడంతో ఆ వ‌ర్గంలో త‌మ‌కు వ్య‌తిరేక‌త రాకుండా చూసుకునేందుకు అనంత‌బాబును దూరం పెట్టే అవ‌కాశాలున్నాయ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.