మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి అతి మామూలుగా లేదు. మాజీ మంత్రినే హత్య చేశానని, దాన్ని సాకుగా చూపి జనాన్ని భయపెట్టి సొమ్ము చేసుకోవాలనే ప్రయత్నాల్లో అతను వున్నట్టు కనిపిస్తోంది. ప్రతిదీ వివాదాస్పదం చేస్తూ, దాన్ని జగన్ ప్రభుత్వానికి ముడిపెట్టాలని దస్తగిరి చూస్తున్నాడు. అతనికి ఎల్లో మీడియా తోడైంది. తాజాగా అతను మరోసారి సంబంధం లేని అంశంలో వివాదాస్పదమయ్యాడు.
తనను ఏదో ఒక కేసులో ఇరికించాలని వైసీపీ ప్రభుత్వం చూస్తోందని అతను ఆరోపించాడు. శ్రీకాళహస్తిలో తమ బంధువుల స్థల వివాద పరిష్కారానికి పులివెందుల నుంచి ఇతగాడు వెళ్లాడట. శ్రీకాళహస్తి పోలీసులు తనపై ఉద్దేశపూర్వకంగానే 41ఏ కేసు పెట్టారని అతను ఆరోపించాడు. శ్రీకాళహస్తి ఎస్ఐతో తనలో ఫోన్లో మాట్లాడే సందర్భంలో, అక్కడి సీఐ అంజూ యాదవ్ తనను చాలా చెడుగా మాట్లాడిందంటూ ఆరోపించాడు.
వివేకా హత్య కేసులో నిందితుడైన దస్తగిరికి పక్క జిల్లాలోని వివాదాలతో పనేంటి? తన గురించి ఎవరైనా గొప్పగా మాట్లాడ్డానికి మంచి పనులు ఏం చేశాడని అనుకుంటున్నాడో అతనికే తెలియాలి. వైసీపీ ప్రభుత్వంపై, అలాగే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై దస్తగిరి అర్థంపర్థం లేని ఆరోపణలు చేస్తే, వాటికి ఎల్లో మీడియా ప్రాధాన్యం ఇవ్వడాన్ని ఎలా చూడాలి? జగన్‌పై అక్కసుతో ఇలాంటి క్రిమినల్స్‌ని ప్రోత్సహిస్తే… అంతిమంగా సమాజానికే నష్టమని ఎందుకు భావించడం లేదు? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
దస్తగిరి ఒక్కోసారి ఒక్కోలా మాట్లాడుతున్నాడు. తనిష్టం వచ్చినట్టు అధికారులు, నేతలపై విమర్శలు గుప్పిస్తున్నాడు. మాజీ మంత్రిని చంపిన వాడిగా తనకు తాను టెర్రరైజ్ సృష్టించి, దాన్ని సొమ్ము చేసుకునే క్రమంలోనే శ్రీకాళహస్తికి వెళ్లినట్టు పోలీసులు చెబుతున్నారు. ఇలాంటి వాడిని తన్ని జైల్లో పడేయక సన్మానిస్తారా? ఏంటీ ఓవరాక్షన్?