తనకు తాడిపత్రిని అప్పగిస్తే చాలు సొంత డబ్బులు సంచుల్లో తెచ్చి అయినా ఊరిని అభివృద్ధి చేసేస్తానంటూ హడావుడి మాటలు మాట్లాడారు. అవకాశం ఇస్తే చాలంటూ రచ్చ రచ్చ చేశారు. మరీ తీరా అవకాశం దక్కితే, సంచుల్లో డబ్బులు తేవడం మాట అటుంచి, తనే భిక్షాటనకు బయల్దేరారు జేసీ ప్రభాకర్ రెడ్డి! ఏదో రకంగా పొలిటికల్ డ్రామాను పండించడంలో ఆరితేరిన జేసీ ప్రభాకర్ రెడ్డి ఇప్పుడు చంద్రబాబు మార్గంలో నడుస్తున్నట్టున్నారు.
బహుశా వయసు రీత్యా కావచ్చు.. లేకపోతే జీవిత చరమాంకంలో సరైన ప్రత్యర్ధి ఎదురవడమే.. లేక తన వారసులకు రాజకీయ భవిష్యత్తు కల్పించలేకపోయమానే బాధ తెలియడం లేదు కానీ నిత్యం ఏదో ఒక హడావుడి చేసుకుంటూ మీడియాలోకి ఎక్కుతూ..దండాలు పెట్టుకొట్టుకుంటూ సాగుతోంది జేసీ ప్రభాకర్ రెడ్డి రాజకీయం.
టీడీపీ అధినేత చంద్రబాబు నడిపించిన భిక్షాటన రాజకీయ బాటలో నడుస్తూ జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా తాడిపత్రిలో భిక్షాటన అంటూ హైడ్రామా సృష్టించారు. కొద్ది సేపు ఉద్రిక్తతను సృష్టించి తర్వాత తనకు అలవాటు అయిన మీడియా సమావేశంలో దండం పెడతా, మేము గాంధేయ వాదులంటూ వాపోయారు.
తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ గా ఉన్న జేసీ ప్రభాకర్ రెడ్డి.. తమ మున్సిపల్ వాహనాల రిపేర్లకు ప్రభుత్వం నిధులు కేటాయించడం లేదని నిరసనిస్తూ తాడిపత్రి పరిధిలో భిక్షాటనకు దిగారు. తాను తాడిపత్రిని క్లీన్ అండ్ గ్రీన్ చేయాలని భావిస్తుంటే కనీసం వాహనాల రిపేర్లకు డబ్బులు ఇవ్వడం లేదని వాపోయారు!
నిరసనకు దిగిన జేసీ ప్రభాకర్ రెడ్డి మెడలో ఒక ప్లకార్దుతో నిరసన దిగారు. ఆ కార్డు మీద నా నినాదం – నా అజెండా అని రాసి ఉంది. నా నినాదం అంటే తాను అనుకున్నది జరగాలని.. నా అజెండా అంటే ప్రజా ప్రయోజనాలు తప్ప సొంత అజెండా కోసం నిరసనలు చేయడం అంటున్నారు ప్రత్యర్థి పార్టీ నేతలు. తన సొంత నిధులతో తాడిపత్రిని కాపాడతా అని చెప్పే జేసీ ఇప్పుడు ఎందుకు లేని సమస్య కోసం భిక్షాటన డ్రామాలు ఆడుతున్నారంటున్నారు వైసీపీ నాయకులు.