ఉమ్మడి ఏపీలోప్రజారాజ్యం పార్టీ పెట్టిన మెగాస్టార్ చిరంజీవి ముఖ్యమంత్రి కావాలనుకొని ఆశపడి, అది సాధ్యం కాకపోవడంతో తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి యూపీఏ ప్రభుత్వంలో కేంద్రమంత్రి అయిన సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు తమ్ముడు, పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా అదే దిశగా ఆలోచిస్తున్నారట. వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో మళ్ళీ బీజేపీ అధికారంలోకి వస్తుందని పవన్ కళ్యాణ్ అంచనా వేస్తున్నారు. కాబట్టి ఎంపీగా గెలిస్తే కేంద్రంలో మంత్రి కావడం గ్యారంటీ అనుకుంటున్నారట.
అయితే ఈయన చిరంజీవి మాదిరిగా జనసేనను బీజేపీలో విలీనం చేసి కేంద్రమంత్రి కావాలనుకోవడంలేదు. వాస్తవానికి పవన్ కళ్యాణ్ కు ముఖ్యమంత్రి కావాలని ఉంది. కానీ జనసేన పార్టీకి మెజారిటీ సీట్లు (పవన్ సీఎం అయ్యేన్ని సీట్లు) వచ్చే అవకాశంలేదు. తెలుగుదేశం పార్టీతో పొత్తుతో వెళ్లే అవకాశాలున్నాయని చెబుతున్నప్పటికీ బీజేపీని కూడా కలుపుకొని వెళ్లాలనేది పవన్ యోచనగా ఉంది. అయితే విశాఖలో ప్రధాని మోడీ ఇచ్చిన రోడ్ మ్యాప్ తో టీడీపీ, జనసేన పొత్తుకు సంబంధించిన విషయం సందిగ్ధంలో పడింది.
ఒకవేళ తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉండే పక్షంలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు. ఎమ్మెల్యేగా గెలిస్తే చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారు. అందులో డిప్యూటీ సీఎం పదవి తీసుకోవడం పవన్ కు ఒక ఆప్షన్ గా ఉంది. అలాకాకుండా ఎంపీగా పోటీచేసి కేంద్రంలో మంత్రిగా ఉండాలని ఒక ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. రాష్ట్రంలో చంద్రబాబు, కేంద్రంలో పవన్ కల్యాణ్ కలిసి రాష్ట్రాన్ని పూర్తిగా అభివృద్ధి పథంలో పయనింపచేయాలనేది ఒక ఆలోచనగా ఉన్నట్లు రాజకీయవర్గాల్లో వినిపిస్తోంది.
ఎంపీగా పోటీచేయాలనే అనూహ్యమైన నిర్ణయాన్ని తీసుకుంటే అప్పుడు నియోజకవర్గాన్ని ప్రకటిస్తారని జనసేన వర్గాలు చెబుతున్నాయి. వాస్తవానికి ఉమ్మడి అనంతపురం నుంచి ఎంపీగా పోటీ చేయాలనుకుంటున్నారు. ఎమ్మెల్యేగా అయితే ఉమ్మడి తూర్పుగోదావరిలోని పిఠాపురమని వార్తలు వస్తున్నాయి. వీటిని జనసేన వర్గాలు కూడా ఖండించడంలేదు. ముందుగా ఈ నియోజకవర్గాల్లో సర్వే చేయించుకొని గెలుపు అవకాశాలు కచ్చితంగా ఉంటాయని ధ్రువీకరించుకున్న తర్వాతే బయటకు ప్రకటించే అవకాశం ఉంది.