వైసీపీ ప్రభుత్వం మీద కుట్ర… బొత్స మాటల వెనక …?

ఏపీలో 151 మంది ఎమ్మెల్యేలు మరో నలుగురు ఎమ్మెల్యేల సపొర్ట్ తో అసెంబ్లీ మొత్తం తానే అన్నట్లుగా ఉన్న వైసీపీ ప్రభుత్వం మీద కుట్ర జరుగుతోందా. అది నిజమేనా. అలా అయితే ఎవరు చేస్తారు. ఈ…

ఏపీలో 151 మంది ఎమ్మెల్యేలు మరో నలుగురు ఎమ్మెల్యేల సపొర్ట్ తో అసెంబ్లీ మొత్తం తానే అన్నట్లుగా ఉన్న వైసీపీ ప్రభుత్వం మీద కుట్ర జరుగుతోందా. అది నిజమేనా. అలా అయితే ఎవరు చేస్తారు. ఈ ప్రశ్నలు ఇపుడు అందరిలో కలుగుతున్నాయి. వైసీపీలో సీనియార్ మంత్రి బొత్స సత్యనారాయణ తాజాగా వైసీపీ సర్కార్ మీద కుట్ర అంటూ సంచలన కామెంట్స్ చేశారు.

రాష్ట్రంలో ఉన్న తమ ప్రభుత్వం మీద పెద్ద కుట్ర జరుగుతోంది అని బొత్స అంటున్నారు. ఆ కుట్ర ఎవరు చేస్తున్నారు. సూత్రధారులు పాత్రధారులు ఎవరు అన్న దాన్ని ఆయన బయటపెట్టలేదు కానీ తన కామెంట్స్ తో ఏపీ రాజకీయాల్లో ఒక పెద్ద చర్చకు ఆస్కారం కల్పించారు.

తెలుగుదేశం అధినేత చంద్రబాబు అసత్యాలతో ప్రజలను మభ్యపెట్టేందుకు చూస్తున్నారు అని బొత్స మరో విమర్శ చేశారు. చంద్రబాబు ఈ రోజూ నిన్నా కాదు కదా ఎప్పటి నుంచో ఆయన వైసీపీ మీద తనదైన శైలిలో విమర్శలు చేస్తున్నారు. ఆ విషయంలో ఎప్పటికపుడు వైసీపీ కూడా బాబు విమర్శలను తిప్పికొడుతోంది  కాబట్టి అది కుట్ర అనడానికిలేదు.

మరి బొత్స వంటి సీనియర్ కుట్ర కోణం అంటున్నారు అంటే వైసీపీ లోపలా బయటా దాని మీద విస్తృతమైన చర్చ అయితే సాగుతోంది. కుట్ర చేస్తే రాజకీయ లాభం ఉండాలి., ప్రయోజనం ఉండాలి. మరి తిరుగులేని మెజారిటీతో  వైసీపీ ఎంతో పటిష్టంగా ఉంది. ఏదో అరకొర మెజారిటీతో తుమ్మితే ఊడే ముక్కు లాంటి ప్రభుత్వం కానే కాదు.  జగన్ అత్యంత శక్తివంతమైన నాయకుడు. కేంద్రం కూడా ఏపీ వైపు చూసినట్లుగా దాఖలు లేవు. పైగా మంచి సంబంధాలు కొనసాగుతున్నాయి.

ఈ నేపధ్యం నుంచి చూసినపుడు బొత్స కుట్ర అనడం ఎలా అర్ధం చేసుకోవాలో మరి. ఇక్కడ బొత్స మరో మాట అన్నారు. వైసీపీ నేతలు కార్యకర్తలు విభేదాలు విడనాడాలని, అంతా సమిష్టిగా పనిచేయాలని. పార్టీ పరంగా ఆయన సందేశం ఇచ్చినట్లుగా ఉన్నా ఎటు నుంచి కుట్ర ముప్పు పొంచి ఉందో మాత్రం పెద్దాయన చెప్పలేదు. దాంతో ఎవరికి తోచిన తీరున వారు దానికి అర్ధాలు చెప్పుకోవాల్సిందే.