ప్రముఖ కమెడియన్, నిర్మాత బండ్ల గణేష్ తన ‘జీవితా’శయాన్ని నెరవేర్చుకున్నారు. ‘మా’ ఎన్నికల్లో తాను వ్యతిరేకిస్తున్న వ్యక్తి ఓటమి..బండ్ల గణేష్ కళ్లలో ఎంతో ఆనందాన్ని నింపింది. కాసేపటి క్రితం ‘మా’ ఎన్నికల తుది ఫలితాలు వెల్లడయ్యాయి. మంచు విష్ణు ప్యానల్ ఘన విజయం సాధించింది. ఇదే సందర్భంలో బండ్ల గణేష్ తాను దైవంగా ఆరాధించే కుటుంబం బలపరిచిన ప్రకాశ్‌రాజ్ ప్యానల్ ఓటమి పాలైంది.
ఇదే ప్రకాశ్‌రాజ్ ప్యానల్ నుంచి జనరల్ సెక్రటరీగా పోటీ చేసిన జీవితారాజశేఖర్ ఓటమి పాలు కావడం బండ్ల గణేష్‌కు ఎంతో తృప్తినిచ్చింది.
జీవితా రాజశేఖర్‌పై ప్రత్యర్థి రఘుబాబు కేవలం ఏడు ఓట్ల తేడాతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో ఎంతో మంది విజయం సాధించినప్పటికీ, కేవలం రఘుబాబుకు మాత్రమే బండ్ల గణేష్ ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పడం గమనార్హం. ప్రకాశ్‌రాజ్ ప్యానల్లోకి జీవిత రాకను బండ్ల బహిరంగంగానే వ్యతిరేకించి సంచలనం సృష్టించారు.
జీవితకు వ్యతిరేకంగా బరిలో నిలుస్తానని బండ్ల ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వెనక్కి తగ్గారు. కానీ జీవితను ఓడించడమే తన లక్ష్యంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో జీవిత ఓడిపోవడంపై బండ్ల హర్షం వ్యక్తం చేయడంతో పాటు ఆమెపై గెలుపొందిన రఘుబాబుకు శుభాకాంక్షలు చెప్పడం విశేషం.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘మా’లో జీవిత లాంటి వ్యక్తి వుండకూడదని భావించానన్నారు. అందుకే ఆమె ఓటమికి తన వంతు ప్రయత్నం చేశానన్నారు. జీవితను ఓడించి ‘మా’ సభ్యులు మంచి నిర్ణయం తీసుకున్నారని ఆయన అన్నారు.