అందుకే చిరంజీవి వర్గం ఎప్పటికీ లీడర్లు కాలేరు

ఒక్కసారి కాదు..పదే పదే రుజువౌతూనే ఉంది. చిరంజీవి వర్గం ఎప్పటికీ నాయకులు కాలేరు.  Advertisement వాళ్లకి అంగబలం, అర్థబలం ఉన్నా ఏ బలాన్ని ఎలా వాడాలో ఎప్పుడు వాడాలో తెలియదు. ఆ తెలివి ఏమాత్రం…

ఒక్కసారి కాదు..పదే పదే రుజువౌతూనే ఉంది. చిరంజీవి వర్గం ఎప్పటికీ నాయకులు కాలేరు. 

వాళ్లకి అంగబలం, అర్థబలం ఉన్నా ఏ బలాన్ని ఎలా వాడాలో ఎప్పుడు వాడాలో తెలియదు. ఆ తెలివి ఏమాత్రం లేదు. ప్రత్యర్థి బలాన్ని అంచనా వేయడం అస్సలు చేతకాదు. 

రాజకీయమనేది చదరంగం ఆటలాంటింది. ఎదుటివాడు పథకం వేసే లోపు చెక్ పెట్టేవాడే ఇక్కడ నాయకుడవ్వగలుగుతాడు. ఆ ఆలోచనాశక్తి, చొరవ, నైపుణ్యం ఏమాత్రం లేని కుటుంబం చిరంజీవి కుటుంబం. 

ఫోన్ చేసో, కుదిరితే వ్యక్తిగతంగా కలిసో ఓట్లు అడుక్కోవాలి. ప్రధానమంత్రి నుంచి కార్మిక నాయకుడి దాకా ఎన్నికల్లో చేసే పని ఇదే. మనసుల్ని గెలుచున్నవాడే ఓట్లను గెలుచుకోగలుగుతాడు. విష్ణు ఆ పని చేసాడు. ప్రకాష్ రాజ్ చేయలేదు. 

ప్రకాష్ రాజ్ మొట్టమొదటి స్పీచులోనే డకౌట్ అయ్యాడు. కచ్చితంగా చిరంజీవి క్యాంపు ప్రమేయం లేకుండా ప్రకాష్ రాజ్ ఈ స్పీచు ఇవ్వడు. 

యథాతథంగా కాకపోయినా ఒక్కసారి ఆ స్పీచ్ సారాంశాన్ని గుర్తు చేసుకుందాం: 

“మొత్తం సభ్యులు 900 కాదు. నేను లెక్కేసాను. 150 మంది యాక్టివ్ మెంబర్స్ కాదు. 175 మంది స్థానికంగా ఉండరు. షూటింగులకోసం వస్తారు, వెళ్తారు. వచ్చి ఓటేయరు. జెనీలియా మహారాష్ట్రా సీయం కొడుకుని పెండ్లి చేసుకుని ఆమె బాగానే ఉంది. ఆమె రాదు. మిగతావాళ్లల్లో రాం చరణ్, నాగచైతన్య లాంటి వాళ్లకి అవసరం లేదు..వాళ్లు రారు. 200 మంది మెంబర్స్ ఆర్థికంగా బానే ఉన్నారు. అన్ని లెక్కలు పోగా మిగిలంది 250 మంది పేద మెంబర్లు. వాళ్లని ఆదుకోలేమా?” అని మాట్లాడాడు. 

ఇది ఎంత అమయాకత్వపు స్పీచో ఇట్టే తెలుస్తుంది. సింపులుగా ప్రత్యర్థులకి ఎవరి మీద కాన్సెట్రేట్ చెయ్యాలో చెప్పినట్టయ్యింది. వాళ్లదే చేసారు. జెనీలియాని తీసుకొచ్చి ఓటేయించారు. స్థానికేతరుల ఓట్లని పోస్టల్ బ్యాలెట్ ద్వారా లాక్కొచ్చేసారు. 

ధనిక మెంబరు, పేద మెంబరు అనే తేడా లేకుండా అందరికీ ఫోన్ చేసి మాట్లాడారు. అందరి మనసుల మీద కర్చీఫులు వేసేసారు. ఓటర్లు ఓట్లు గుద్దేసారు. 

ఇదిలా ఉంటే ఒక పక్క “మా” ఎన్నికలు పెట్టుకుని పవన్ కల్యాణ్ “రిపబ్లిక్” ఈవెంటులో ఇచ్చిన స్పీచ్ ప్రకాష్ రాజ్ ఓటమికి పెద్ద గొయ్యి తవ్వింది. పంచ్ డయలాగ్స్ తో మార్కులు కొట్టెయ్యాలన్న ఊపులో ఏపీ మంత్రిని సన్నాసి అని తిట్టాడు పవన్. సీయం ని కూడా ఏదో అన్నాడు. “మా” మెంబర్సులో వైసీపీ సింపతైజర్స్ కూడా ఉంటారు. వాళ్లని రాంగ్ సైడ్ గోకినట్టేగా! ఈ కామన్ సెన్స్ పవన్ కి లేకపోవడం ప్రకాష్ రాజ్ దురదృష్టం. 

మొత్తానికి ప్రకాష్ రాజ్ ఓడిపోయాడు. కాదు, తమ డేడ్ దిమాక్ ఐడియాలతో, రాంగ్ బిహేవియర్ తో మెగా బ్రదర్స్ ఓడించగొట్టారు. వీళ్లని నమ్ముకుంటే ఎవ్వడికైనా పట్టే గతి ఇదే అనిపించేలా చేసారు. 

ప్రోత్సహించి నిలబెట్టిన వాళ్లు చివరిదాకా వెన్నుదన్నుగా నిలబడాలి. అవతల మోహన్ బాబు తన కొడుకు గెలుపు కోసం అందరికీ ఫోన్లు చేస్తే ఇవతల చిరంజీవి చెయ్యొద్దా? 

నరేష్ కి ఆపోజిట్ గా మాట్లాడమని నాగబాబుని దింపారు. ఆయన కౌంటర్లు ఇవ్వగలడు కానీ తమ ఇమేజ్ తో అపోజిట్ ప్యానల్ ని బుల్డోజ్ చెయ్యలేడు. దానికి మెగాస్టారే సీన్లోకి రావాలి. ఆయన సైలెంటయిపోయి ప్రకాష్ రాజ్ పరువుతీయడమే కాకుండా తన “ఇండస్ట్రీకి పెద్ద దిక్కు” అనే టైటిల్ ని కూడా పోగొట్టుకున్నారు. తన మనిషిని 'మా' ప్రెసిడెంటుగా గెలిపించుకోలేనివాడు ఇండస్ట్రీ పెద్ద ఎలా అవుతాడు? 

చిరంజీవి సైలెన్స్ కి కారణం తెలియదు. మోహన్ బాబుతో మళ్లీ శత్రుత్వం ఎందుకని ఆగిపోయి ఉండొచ్చు. లేదా గెలిచేస్తామని విపరీతమైన నమ్మకమైనా అయ్యుండొచ్చు. ఈ రెండూ కాకపోతే ఎలాగూ ఓడిపోయున్నామనే సంకేతాలు అంది ఉండొచ్చు. అంతకంటే పెద్ద కారణాలు కనిపించట్లేదు. 

ఒకవేళ మొదటిది నిజమైతే ఆదిలోనే ప్రకాష్ రాజ్ ని తప్పుకోమని మంచు విష్ణుని ఏకగ్రీవంగా ఎన్నుకోమని అందరికీ పిలుపునివ్వాలి. ఆ పని చెయ్యలేదు కాబట్టి కారణం అది కాదు. 

మరి రెండో కారణమా అనుకుంటే అంతకు మించిన అమాయకత్వం ఇంకోటుండదు. కారణం మూడోదైతే మాత్రం అది పరమద్రోహం. నమ్ముకున్నవాడిని నట్టేట ముంచడమన్నమాట. 

తెలుగు సినీ పరిశ్రమ కమ్మ వర్గం నుంచి కాపు వర్గం చేతిలోకి వచ్చేసిందని, చిరంజీవిని “పెద్ద దిక్కు”గా పిలుచుకోవడమే దానికి తార్కాణమని అనుకున్నవారికి రీసౌండ్ వచ్చే విధంగా విష్ణు మంచు గెలుపు వినపడింది. 

అయితే ఈ గెలుపుకి కారణం కేవలం కేస్ట్ ఫీలింగ్ కాదు.  చిరంజీవి వర్గం వారి తెలివితక్కువతనమే. సమయానికి తగిన ఎత్తులు వేయలేకపోవడమే. ప్రతి విషయంలోనూ ఆదినుంచి ప్రత్యర్థికన్నా వెనకబడడమే. తమ గొయ్యి తాము తవ్వుకోవడమే. 

ఇక్కడ చెప్పుకోవాల్సిన పెద్ద కామెడీ ఏంటంటే ప్రకాష్ రాజ్ ప్యానల్లో ఉన్న జీవిత 7 ఓట్ల తేడాతో ఓడిపోయింది. చిరంజీవి కుటుంబం నుంచి అల్లు అర్జున్, అల్లు శిరీష్ వంటి వాళ్లు కనీసం 8 మంది వచ్చినా ఆమె గెలిచేది. 

ఇంట్లో ఉన్న వాళ్లనే వీళ్లు ఓటేయడానికి తోలలేకపోయారు. అవతలి ప్యానల్ వాళ్ళేమో జెనీలియాని, జయప్రదని బయటి నుంచి ఫ్లైటులో తీసుకురాగలిగారు. ఇద్దరికీ అంత తేడా ఉంది. పవన్ కల్యాణయినా రాజకీయల్లో గెలుపు బోణీ కొట్టాలంటే ఇలాంటివి చాలా నెర్చుకోవాలి. 

శ్రీనివాస మూర్తి