ఏ సమస్య వచ్చినా కేంద్ర ప్రభుత్వం బుకాయింపులతో, ఎదురుదాడితో కాలం గడిపేయాలని చూస్తోంది… ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా చేసిన వ్యాఖ్య ఇది. దేశంలో బొగ్గు కొరత లేదు.. అని అంటూ కేంద్ర మంత్రి ఆర్కే సింగ్ చేసిన ప్రకటనపై సిసోడియా అసహనం వ్యక్తం చేశారు. దేశ రాజధాని ఢిల్లీని విద్యుత్ కష్టాలు చుట్టుముట్టిన నేపథ్యంలో సిసోడియా స్పందించారు. గతంలో కరోనా తీవ్ర ప్రభావం చూపిన వేళ ఆక్సిజన్ కొరత లేదంటూ కేంద్రం చెప్పినట్టుగానే ఇప్పుడు, బొగ్గు విషయంలో కూడా బుకాయింపులు జరుగుతున్నాయని ఢిల్లీ డిప్యూటీ సీఎం వ్యాఖ్యానించారు.
దేశం ప్రగతి, మనుగడ మొత్తం విద్యుచ్ఛక్తి మీద ఆధారపడి ఉంది. అలాంటి విద్యుత్ లో 53 శాతం బొగ్గు ద్వారానే తయారు చేసుకుంటూ ఉంది భారతదేశం. ఈ బొగ్గులో కూడా కొంత వరకూ దేశీయ మైనింగ్, మరికొంత దిగుమతుల మీద ఆధారపడి ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో.. థర్మల్ విద్యుత్ ప్రాజెక్టులకు కోల్ అందుబాటును అంచనా వేసుకోలేనంత పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఉందా? అనే ప్రశ్న తలెత్తుతూ ఉంది.
ఇక ఇదే సమయంలో.. ఇదంతా.. కార్పొరేట్ల మాయజాలం అనే మాట కూడా వినిపిస్తూ ఉంది. ఇప్పుడు దేశాన్ని శాసిస్తున్న కార్పొరేట్లు బొగ్గు వ్యాపారంలో కృత్రిమ కొరతను కూడా సృష్టించారని కూడా విశ్లేషకులు అంటున్నారు. అంతర్జాతీయంగా బొగ్గుకు డిమాండ్ పెరిగిన మాట వాస్తవమే, ఇప్పుడు బొగ్గు అమ్ముకోవడం అంటే.. లాభాల పంట. ఈ పరిస్థితుల్లో ఇప్పటికే కొన్ని దేశీయ కార్పొరేట్లు భారీగా బొగ్గు నిల్వలను కలిగి ఉన్నాయని, వాటితో తప్పనిసరిగా కొనే పరిస్థితిని కేంద్రమే కల్పించిందనే విమర్శ కూడా వినిపిస్తూ ఉంది. తెలివైన వాళ్లు అయితే.. ఇప్పుడు బొగ్గు కొనరు..అని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు.
ప్రత్యామ్నాయ ఇంధనవనరుల మీద ఆధారపడటమే మంచి పరిష్కారం అని అంటున్నారు. అయితే ఇప్పటికిప్పుడు ప్రత్యామ్నాయ వనరులు అంటే మాటలు కాదు. దాహం వేసినప్పుడు బావి తవ్వలేం. దేశీయ కోల్ మైనింగ్ ను ఈ పరిస్థితులకు తగ్గట్టుగా ఏ మేరకు సమన్వయం చేస్తారు? అనేది ప్రశ్నార్థకం. ఇది మోడీ ప్రభుత్వ సమర్థత మీద ఆధాపడి ఉంది. అయితే సమర్థత అనే మాట వినిపించినప్పుడల్లా భక్తులు లేచి వస్తారు. సమస్యే లేదని కేంద్రం అంటుంది. భక్తులేమో రాష్ట్రాలది తప్పని తోసేస్తారు. అనుభవించే ప్రజల కష్టాలు పరాకాష్టకు చేరతాయి. నోట్ల రద్దు దగ్గర నుంచి ఇదే కథ. ఇదే వ్యథ. ఇప్పుడు బొగ్గు సంక్షోభంతో మరోసారి రిపీటయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి.
ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో కరెంటు కోతలు తీవ్రం అయ్యాయి. పంజాబ్ తో మొదలుపెడితే, దేశ రాజధానే విద్యుత్ సంక్షోభంలో చిక్కుకుంటోంది. భారీ ధరలను వెచ్చించి కరెంటు కొనుగోలు చేయడం రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిని గుల్ల చేయనున్న వైనం కూడా కనిపిస్తూ ఉంది. బొగ్గు నిల్వలను సమన్వయం చేసుకోలేకపోవడం అనే కేంద్ర ప్రభుత్వ ఘనకార్యం పెద్ద సంక్షోభానికే దారి తీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కరోనా పరిస్థితుల నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న పరిశ్రమలను విద్యుత్ సంక్షోభం తీవ్రమైన పరిస్థితుల్లోకి నెట్టేసే అవకాశాలు లేకపోలేదు!