‘మా’పై మెగా బ్రదర్ నాగబాబు షాకింగ్ కామెంట్స్ చేశారు. మంచు విష్ణు ప్యానల్ గెలుపొందడం…ముఖ్యంగా మెగా అభిమానుల్లో నిరాశ నింపింది. ప్రకాశ్‌రాజ్‌ను ‘మా’ అధ్యక్ష బరిలో నిలబెట్టిందే మెగా ఫ్యామిలీ అనే ప్రచారం విస్తృతంగా జరిగింది. కానీ తాము మద్దతు మాత్రమే ఇచ్చామని నాగబాబు పలు సందర్భాల్లో చెప్పారు. ఈ నేపథ్యంలో తాము బలపరిచిన ప్రకాశ్‌రాజ్ ప్యానల్ ఓడిపోవడంతో నాగబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు.
అంతేకాదు, ‘మా’పై ఆయన షాకింగ్ కామెంట్స్ చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. ‘మా’ అధ్యక్షుడిగా మంచు విష్ణు ఎన్నిక కావడంతో పాటు ఆయన ప్యానల్ ఘన విజయం సాధించిందని తెలిసిన వెంటనే… తన సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు నాగబాబు ప్రకటించారు.
ప్రాంతీయవాదం, సంకుచిత మనస్తత్వంతో ‘మా’ కొట్టుమిట్టాడుతోందని తీవ్ర ఆరోపణలు చేశారు. ఇలాంటి అసోసియేషన్‌లో కొనసాగడం ఇష్టంలేకే రాజీనామా చేస్తున్నట్లు నాగబాబు షాకింగ్ కామెంట్స్ చేశారు.
తన రాజీనామా లేఖను 48 గంటల్లో ‘మా’ కార్యాలయానికి పంపుతానని స్పష్టం చేశారు. ఎంతో ఆలోచించి రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తేల్చి చెప్పారు. ప్రకాశ్‌రాజ్ నాన్ లోకల్ అంటూ మంచు విష్ణు మద్దతుదారులు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు.
ఇదే ప్రకాశ్‌రాజ్ ప్యానల్ ఓటమికి దారి తీసిందని నాగబాబు నమ్మినట్టున్నారు. ప్రకాశ్‌రాజ్ ప్యానల్ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నాగబాబు రాజీనామా నిర్ణయంపై ప్రత్యర్థులు ఎలా స్పందిస్తారో మరి!