‘మా’ ఎన్నికలు టాలీవుడ్లో చీలికలు తెచ్చాయని మెగాస్టార్ చిరంజీవి మాటలు మరోసారి చాటి చెప్పాయి. టాలీవుడ్లో కొందరు ఆధిపత్యం ప్రదర్శించడానికి అవతలి వాళ్లను కించపరిస్తున్నారనే భావన చిరంజీవిలో బలంగా ఉన్నట్టు తేలిపోయింది. అందుకే అలాంటి వాళ్లను దూరంగా పెడితే తప్ప టాలీవుడ్ వసుధైక కుటుంబంగా ఉండదని చిరంజీవి హెచ్చరించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇంతకూ చిరంజీవి చేస్తున్న హెచ్చరిక ఎవరి గురించి? అనే ప్రశ్న సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. ఓ సినిమా వేడుకలో చిరంజీవి మాట్లాడిన అంశాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘మా’ ఎన్నికల ఫలితాలు వెల్లడైన సమయంలోనే, చిరంజీవి కీలక వ్యాఖ్యలు తెరపైకి వచ్చాయి.
పదవులు తాత్కాలికం అని చెప్పడం, ఇతరులను నిందించడం, అనిపించుకోవడం ద్వారా బయటి సమాజం దృష్టిలో లోకువై పోతామనే చిరంజీవి సుతిమెత్తని హెచ్చరికను సానుకూల కోణంలో తీసుకోవాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మెగాస్టార్ చిరంజీవి ఏమన్నారో ఆయన మాటల్లోనే…
‘హీరోల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణం ఉండాలి. అలా ఉంటే ఈ పరిశ్రమలో ఎలాంటి వివాదాలు ఉండవు. తాత్కాలికమైన పదవుల కోసం మాటలు అనడం.. అనిపించుకోవడం వల్ల బయట వాళ్లకి లోకువైపోతాం. మన ఆధిపత్యం చూపించుకోవడానికి అవతలి వాళ్లను కించపరచాల్సిన అవసరం లేదు. అసలు వివాదానికి మూలం ఎవరో గుర్తించి.. అలాంటి వ్యక్తుల్ని దూరం పెట్టగలిగితే మనదే వసుధైక కుటుంబం’ అని ఆయన అన్నారు.
టాలీవుడ్లో ఆధిపత్యం చెలాయించేందుకు అవతలి వాళ్లను కించపరుస్తున్నారని చిరంజీవి భావిస్తుండడం వల్లే అలా మాట్లాడారని ఆయన అభిమానులు అంటున్నారు. అలాంటి వివాదాస్పద వ్యక్తులెవరో గుర్తించి, సమస్యకు మూలాలకు హోమియోపతి మందులాందిది వేయాలని ఆయన సూచించడం గమనార్హం. ఎందుకంటే హోమియోపతి మందు మూలాల్లోకి వెళ్లి శాశ్వతంగా నయం చేస్తుందని ఆయన చెప్పుకొచ్చారు.
ఏది ఏమైనా టాలీవుడ్లో అవాంఛనీయ వాతావరణం ఉందని మరోసారి చిరంజీవి మాటలు ప్రతిబింబించాయి. ఇందులో తన కుటుంబ సభ్యుల పాత్ర ఏంటనేది చిరంజీవి తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేవాళ్లు లేకపోలేదు.