‘మా’ ఎన్నికల ఉత్కంఠకు తెరపడింది. గత కొన్ని రోజులుగా ‘మా’ ఎన్నికలు టాలీవుడ్‌లో రాజకీయ వేడిరగిల్చాయి. వర్గాలుగా చీలిపోయి మాటకు మాట అంటూ …ఎవరికి ఎవరూ తగ్గకుండా విమర్శలు గుప్పించుకున్నారు. చివరికి ‘మా’ విజేతగా మంచు విష్ణు నిలిచారు.
అయితే మంచు విష్ణు విజయం వెనుక ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉన్నారా? లేరా? అనేది ఇప్పుడు ప్రశ్న. అలాగే ‘మా’ ఓటమి మరో రెండున్నరేళ్లలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కాపులను ఏకం చేస్తుందా? అనేది మరో ప్రశ్న. ‘మా’ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంచు విష్ణు పలు సందర్భాల్లో తనకు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సన్నిహిత సంబంధాలు న్నాయని చెప్పారు. మరీ ముఖ్యంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తనకు బావ అవుతారని చెప్పడం చర్చనీయాంశమైంది.
మంచు విష్ణు ఉద్దేశపూర్వకంగా రాజకీయాలను ‘మా’ ఎన్నికల్లో చొప్పిస్తున్నారని ప్రకాశ్‌రాజ్‌తో పాటు ఆయన ప్యానల్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. మరోవైపు ‘మా’ సభ్యులకు ఏపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఫోన్ చేసి మంచు విష్ణు ప్యానల్‌ను గెలిపించాలని కోరుతున్నట్టు ప్రకాశ్‌రాజ్ ప్యానల్ సభ్యులు ఆరోపించారు. దీంతో ఏపీ మంత్రి పేర్ని నాని స్పందిస్తూ… తమకు, ‘మా’ ఎన్నికలకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టత ఇచ్చారు. ముఖ్యమంత్రికి మా ఎన్నికలపై ఎలాంటి ఆసక్తి లేదని తేల్చి చెప్పారు.
అయితే మా ఎన్నికలు పవన్‌కల్యాణ్ వర్సెస్ జగన్ అనే రీతిలో టర్న్ తీసుకున్నాయని, ప్రకాశ్‌రాజ్ గెలిస్తే జగన్ పరువు పోతుందనే భయంతో ప్రభుత్వం వెనక్కి తగ్గిందని ఎల్లో మీడియా ప్రచారం చేసింది. కానీ మా ఎన్నికల్లో రోజురోజుకూ రాజకీయ వాతావరణం మారుతుండడం, మంచు విష్ణుకు మద్దతు పెరగడాన్ని పసిగట్టిన ఎల్లో మీడియా జగన్ ప్రమేయంపై ప్రచారాన్ని నిలిపేసింది. టాలీవుడ్‌లో జగన్ హీరో అవుతాడని ఎల్లో మీడియా భయపడింది.
పవన్‌పై ప్రేమతో చేసిన ప్రచారం కూడా కాదు. జగన్‌పై అక్కసుతో కనీసం మా ఎన్నికల్లోనైనా ఆయన బలపరిచిన మంచు విష్ణు ప్యానల్ ఓడిపోయిందనే తృప్తి కూడా మిగల్లేదు. కాపు వర్సెస్ కమ్మ అనే రీతిలో సాగిన ‘మా’ ఎన్నికల్లో చివరికి …చిత్రపరిశ్రమలో కమ్మలదే ఆధిపత్యం అని మరోసారి రుజువైంది. ఈ ఎన్నిక ప్రత్యేకత ఏంటంటే కమ్మ సామాజిక వర్గ గెలుపును రెడ్లలోని మెజార్టీ వర్గీయులు ఆస్వాదించడం.
ఇదే జనసైనికులు జీర్ణించుకోలేకున్నారు. తమను ఓడించేందుకు ఆ రెండు సామాజిక వర్గాలు ఏకమవుతాయని, తమలో అది లేదని కాపుల ఆవేదన. తమ ఆవేదనను జనసైనికులు తమ సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తున్నారు. రెడ్డి, కమ్మ సామాజిక వర్గాలపై విరుచుకుపడుతున్నారు.
ప్రకాశ్‌రాజ్ ప్యానల్ ఓటమి… మెగా అభిమానులు జీర్ణించుకోలేకున్నారు. ఆ రెండు సామాజిక వర్గాలు తాము తప్ప ఇతరులెవరూ ఎన్నికల్లో గెలవకూడదనే కక్షతో వ్యవహరిస్తున్నాయనే ఆగ్రహం కాపుల్లో ఉంది. కనీసం సాధారణ ఎన్నికల్లోనైనా కాపుల్లో ఐక్యత వస్తే మంచిదే. ఈ ఎన్నిక అందుకు గుణపాఠమైతే మరీ మంచిది.