మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల విషయంలో ఎంత హడావుడి జరిగినా, ఇవేవో దేశ రాష్ట్ర పతి ఎన్నికలు అన్నట్టుగా సినిమా వాళ్లు, మీడియా హడావుడి చేసినా.. నమోదైన పోలింగ్ శాతం మాత్రం 60ని దాటలేదు. కేవలం 900 మంది సభ్యులున్న అసోసియేషన్ ఎన్నికల్లో అటు ఇటుగా దాదాపు 60 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఇదీ మా ఎన్నికలపై సినీ ఆర్టిస్టుల్లో ఉన్న ఆసక్తి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. ఆసక్తిని కలిగిన వారిలో విపరీతమైన ఆసక్తి, అనాసక్తి ఉన్న వారిలో అసలు ఓటేయడం మీదే అనాసక్తి ఉన్నట్టుంది. దీంతోనే జరిగిన రచ్చకూ, నమోదైన పోలింగ్ శాతానికీ సంబంధం లేకుండా పోయినట్టుగా ఉంది.
ఇక ఈ ఎన్నికల్లో కొందరు ప్రముఖులే ఓటు హక్కును వినియోగించుకోలేదు. వీరిలో స్టార్ హీరోలున్నారు. అసోసియేషన్ రాజకీయంలో కీలక పాత్ర పోషిస్తున్న వర్గాల వాళ్లున్నారు. అధ్యక్ష ఎన్నికల వ్యవహారంలో బాగా రచ్చ చేసిన నరేష్ సంబంధీకులు ఓటు హక్కును వినియోగంచుకోలేదు.
అసోసియేషన్ రాజకీయంలో కృష్ణ ఫ్యామిలీకి ప్రతినిధిగా నరేష్ వ్యవహరిస్తూ ఉంటారు. అయితే మహేష్ బాబు ఓటు హక్కును వినియోగంచుకోలేదు. షూటింగుతో ఆయన విదేశంలో ఉండటం వల్ల ఇలా జరిగినట్టుంది. ఒకవేళ మహేష్ ఇక్కడ ఉండి ఉన్నా .. ఈ రచ్చలో ఓటు వేసేవారా? అనేది ప్రశ్నార్థకమే.
ఇక ఈ గందరగోళానికి పూర్తిగా దూరంగా నిలిచాడు ప్రభాస్. ఈ స్టార్ హీరో కూడా మా ఎన్నికల్లో తన ఓటును కాస్ట్ చేయలేదు. ఇక దగ్గుబాటి, అక్కినేని ఫ్యామిలీలు పోలింగ్ ను పెద్దగా పట్టించుకోలేదు. నాగార్జున ఓటేసినా.. నాగచౌతన్య, వెంకటేష్, రానాలు ఓటు హక్కును వినియోగించుకోలేదు. సుమంత్, సుశాంత్ లది కూడా ఇదే బాటే అయ్యింది.
ఇక మా ఎన్నికల విషయంలో హాట్ కామెంట్స్ తో హడావుడి చేసిన నాగబాబు పిల్లలే తమ ఓట్లను వేయకపోవడం గమనార్హం. నాగబాబు తనయుడు వరుణ్ తేజ్, కూతురు నిహారికలకు ఓటు హక్కు ఉన్నా.. ఉపయోగించుకోలేదని స్పష్టం అవుతోంది.
ఇక మెగా ఫ్యామిలీకే చెందిన హీరోలు కూడా ఒకరిద్దరు ఓటు వేయలేకపోయారు. ఇక భవిష్యత్ రాజకీయాలు అనే వార్తల్లో నిలుస్తున్న ఎన్టీఆర్ ఈ ఎన్నికలను పట్టించుకోలేదు. నితిన్ కూడా తన ఓటు హక్కును వినియోగించుకోలేదని తెలుస్తోంది.