సూటిగా అర్థం అవుతున్న విషయం ఏమిటంటే… మా అసోసియేషన్ కు సంబంధించి తాము మద్దతు ఇచ్చిన వ్యక్తి నెగ్గకపోవడంతో, ఆ అసోసియేషన్ సభ్యత్వానికి నాగబాబు రాజీనామా చేశారు. అసోసియేషన్ రాజకీయంలో ఇన్నేళ్లూ చాలా చేసిన నాగబాబు, ఇలా రాజీనామాతో మరోసారి వార్తల్లో నిలిచారు.
ఇదెలా ఉందంటే, అలా ఉంది! ఎవరి మీద అయినా అలగొచ్చు కానీ, చెరువు మీద అలగకూడదు. ఇన్నాళ్లూ అక్కడ ఎనలేని రాజకీయం చేసి, మద్దతును ఇచ్చిన వ్యక్తి గెలవలేదని, ప్రాంతీయ తత్వం అని- సంకుచిత స్వభావం అంటూ ఓటు హక్కు వదులుకోవడమా!
ఎన్నికల్లో దేశంలో కోట్ల మంది ప్రజలు ఓటేస్తారు. వారిలో తాము ఓటేసిన వారు గెలవలేదని ప్రజలు మళ్లీ ఓటు వేయం అంటూ అంటే ఎలా ఉంటుందో, నాగబాబు వాదన ఇలానే ఉంది! ప్రజాస్వామ్యంలో మనకు వ్యక్తిగతంగా నచ్చనివి ఎన్నో జరుగుతుంటాయి. తాము ఓటేసిన వారు గెలిస్తేనే.. ప్రజాస్వామ్యం గెలిచినట్టు అంటే అంతకు మించిన మూర్ఖత్వం మరోటి ఉండదు.
అయినా నాగబాబు మా అసోసియేషన్ లో ఓటు హక్కును వదులుకోవడం లేదా ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయడం వల్ల సమాజానికి వచ్చిన నష్టం ఏమీ లేకపోవచ్చు గాక. అయితే ఇది మెగాబ్రదర్స్ తీరును చర్చగా మారుస్తోంది.
ప్రజారాజ్యం నుంచి చాలా విషయాలను తెరపైకి తెస్తుంది. తాము కోరుకున్నది దక్కితే తప్ప మెగా బ్రదర్స్ పోరాడరా? తాము కోరుకున్నది దక్కితే మాత్రమే వీరు పోరాటంలో ఉంటారు లేకపోతే పూర్తిగా బిచాణా ఎత్తేస్తారా? అనే అభిప్రాయాలను కలిగిస్తూ ఉంది నాగబాబు ప్రకటన.
ప్రజారాజ్యం అధికారానికి ఆమడదూరంలో నిలిచిపోవడంతో మెగాస్టార్ చిరంజీవి ఆ పార్టీని విలీనం చేశారు. ఇక పవన్ కల్యాణ్ ఏమో తనను గాజువాక నుంచి గెలిపించలేదు కాబట్టి.. తనను పోరాడమని ఎవరూ అడగొద్దని అంటారు. తనను గెలిపించి ఉంటే.. పోరాడే వాడిని అంటాడు.
ప్రజాస్వామ్యంలో ఒక రాజకీయ పార్టీని పెట్టిన వారు చేయాల్సిన బ్లాక్ మెయిలింగేనా అది? ఇక ప్రకాష్ రాజ్ గెలవలేదని నాగబాబు సభ్యత్వానికే రాజీనామా అంటున్నాడు!అయితే మెగాసోదరులు తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. వారికి ఎన్నో విషయాలు తెలిసి ఉండొచ్చు.
పవన్ కల్యాణ్ అయితే కొన్ని వేల పుస్తకాలు చదివి ఉండొచ్చు, గాడ్సే గొప్పవాడని నాగబాబుకు అర్థమై ఉండొచ్చు.. కానీ వారి తీరును గమనించాకా.. వారు తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉందని అనిపిస్తోంది. అదేమిటంటే.. గెలవాలంటే ముందు నిలవాలి! గెలుపు మీదున్న ఆశ వీరికి నిలవడం మీద కనిపించడం లేదు. ఇది ఒకటికి పది సార్లు స్పష్టం అవుతున్న విషయం.