సమంతకు ‘ఐ లవ్ యూ’ ఎలా చెప్పగలను?

సమంత-నాగచైతన్య విడాకులపై చాన్నాళ్లుగా పుకార్లు వినిపిస్తూనే ఉన్నాయి. ఎప్పుడైతే వాళ్లు విడిపోతున్నట్టు అధికారికంగా ప్రకటించారో, ఆ తర్వాత పుకార్లు ఆగిపోతాయని అంతా భావించారు. కానీ సమంత-నాగచైతన్య స్టేట్ మెంట్ తర్వాత కూడా పుకార్లు కొనసాగుతూనే…

సమంత-నాగచైతన్య విడాకులపై చాన్నాళ్లుగా పుకార్లు వినిపిస్తూనే ఉన్నాయి. ఎప్పుడైతే వాళ్లు విడిపోతున్నట్టు అధికారికంగా ప్రకటించారో, ఆ తర్వాత పుకార్లు ఆగిపోతాయని అంతా భావించారు. కానీ సమంత-నాగచైతన్య స్టేట్ మెంట్ తర్వాత కూడా పుకార్లు కొనసాగుతూనే ఉన్నాయి. మరీ ముఖ్యంగా సమంత ఓ ఎఫైర్ పెట్టుకుందంటూ మరీ దారణంగా రూమర్లు పుట్టుకొస్తున్నాయి.

సమంత వద్ద స్టయిలిస్ట్ గా పనిచేస్తున్న ప్రీతమ్ జుకాల్కర్ తో ఆమెకు ''సంబంధం'' ఉందంటూ చాలా పుకార్లు వినిపిస్తున్నాయి. వీటిపై సమంత మౌనం వహించింది. ఇప్పటికే ఆమె తాను చెప్పాల్సింది చెప్పేసింది. అయితే ఇలాంటి రూమర్లను నాగచైతన్య ఖండిస్తే బాగుండేదని అభిప్రాయపడ్డాడు స్టయిలిస్ట్ ప్రీతమ్. సమంత-నాగచైతన్య విడాకుల వ్యవహారంలోకి తనను లాగడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాడు.

“సమంతను నేను జిజి (నార్త్ ఇండియాలోని కొన్ని రాష్ట్రాల్లో చెల్లెలు అని అర్థం) అని పిలుస్తాననే విషయం అందరికీ తెలుసు. అలాంటి వ్యక్తితో నాకు ఎఫైర్ ను ఎలా అంటగడతారు. సమంతకు నేను ఎలా ఐ లవ్ యు అని చెప్పగలను. ఇలాంటి వార్తలు రాసి ఎందుకు ఇంత దిగజారిపోతున్నారు. ఆల్రెడీ బాధల్లో ఉన్న ఓ మహిళను ఇలా ఇబ్బంది పెట్టడం అస్సలు మంచిది కాదు.”

ఈ మొత్తం వ్యవహారంపై నాగచైతన్య స్పందించకపోవడాన్ని తప్పుబట్టాడు ప్రీతమ్. సమంతతో తను ఎలా ఉంటానో నాగచైతన్యకు కూడా తెలుసని, అలాంటప్పుడు ఈ తరహా పుకార్లను ఖండించాల్సిన బాధ్యత అతడిపై ఉందంటున్నాడు ప్రీతమ్.

“కొన్నేళ్లుగా నాగచైతన్యకు నేను తెలుసు. సమంతతో నేను ఎలా ఉంటానో కూడా తెలుసు. నా గురించి, సమంత గురించి అలా మాట్లాడ్డం తప్పని నాగచైతన్య ఇప్పటికే చెప్పి ఉంటాడని నేను అనుకున్నాను. కనీసం దీనికి సంబంధించి నాగచైతన్య ఓ స్టేట్ మెంట్ రిలీజ్ చేసినా పరిస్థితి ఎంతో బాగుండేది. ఇప్పటికైనా నాగచైతన్య నుంచి ఓ ప్రకటన వస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను.”

సమంతతో తను రిలేషన్ షిప్ లో ఉన్నానని భావిస్తున్న కొందరు ఫ్యాన్స్ తనను చంపుతానంటూ బెదిరిస్తున్నారని అన్నాడు ప్రీతమ్. ఇప్పటికే తనను బండ బూతులు తిడుతున్నారని, కెరీర్ ను నాశనం చేస్తామంటూ చాలామంది హెచ్చరిస్తున్నారని తెలిపిన ప్రీతమ్.. ఓ దశలో తన తల్లి చనిపోయినట్టు కూడా వెబ్ సైట్స్ లో రాశారని బాధపడ్డాడు.

అయితే ఎంతమంది ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టినా తను వెనక్కి తగ్గనంటున్నాడు ప్రీతమ్. ప్రస్తుతం బాధల్లో ఉన్న సమంతకు అండగా నిలబడతానని ప్రకటించాడు.