పవన్ కు మోహన్ బాబు కౌంటర్ ఉంటుందా?

రిపబ్లిక్ సినిమా వేదికపై పవన్ కల్యాణ్ మోహన్ బాబు పేరు ప్రస్తావించి మరీ కౌంటర్ ఇచ్చారు. ఇప్పుడు కలసి రాకపోతే రేపు నీ విద్యా సంస్థల విషయంలో కూడా ప్రభుత్వం ఇలాగే వ్యవహరిస్తుందని అన్నారు. …

రిపబ్లిక్ సినిమా వేదికపై పవన్ కల్యాణ్ మోహన్ బాబు పేరు ప్రస్తావించి మరీ కౌంటర్ ఇచ్చారు. ఇప్పుడు కలసి రాకపోతే రేపు నీ విద్యా సంస్థల విషయంలో కూడా ప్రభుత్వం ఇలాగే వ్యవహరిస్తుందని అన్నారు. 

అయితే అప్పట్లో మోహన్ బాబు సంయమనం పాటించారు, ఎన్నికల తర్వాత పవన్ కు డీటెయిల్ట్ గా సమాధానం ఇస్తానని అన్నారు. మరి ఆ చాకిరేవు ఇప్పుడు పెట్టేస్తారా..? చిరంజీవి మీద ఉన్న కసి మొత్తం పవన్ కల్యాణ్ పై తీర్చేసుకుంటారా.. లేక కొడుకు విజయంతో అవన్నీ మరచిపోయి జస్ట్ చిన్న చిన్న పంచ్ డైలాగులతో సరిపెడతారా..?

మోహన్ బాబు కౌంటర్ కోసం వైసీపీ వెయిటింగ్..

రిపబ్లిక్ మూవీ వేదికపై పవన్ వ్యాఖ్యల తర్వాత వైసీపీ అభిమానులు చాలామంది హర్ట్ అయ్యారు. మంత్రులు సరిగ్గా కౌంటర్ ఇచ్చినా, పోసాని ఇచ్చిన డోస్ మాత్రం వైసీపీ వారికి కాస్త సంతృప్తినిచ్చింది. ఇక మోహన్ బాబు కూడా ఈ ఎపిసోడ్ లో ఎంటరై పవన్ ఎపిసోడ్ కి ఫినిషింగ్ టచ్ ఇస్తారని చాలామంది ఎదురు చూస్తున్నారు. 

అందులోనూ ఇప్పుడు మోహన్ బాబు, పవన్ కి కౌంటర్ ఇస్తే.. కచ్చితంగా జగన్ ప్రస్తావన తేవాల్సి ఉంటుంది. జగన్ పాలనను పొగుడుతూ, పరోక్షంగా పవన్ వ్యాఖ్యలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. ఇలాంటి ఎపిసోడ్ కోసమే వైసీపీ అభిమానులు ఎదురు చూస్తున్నారు.

మోహన్ బాబుతో మాట్లాడిన పవన్.. కథ సుఖాంతం?

ఇదిలా ఉండగా.. 'మా' ఎన్నికల సందర్భంగా ఓటు వేయడానికి వచ్చిన పవన్ కల్యాణ్, ఓటు వేసిన తర్వాత మోహన్ బాబుతో మాట్లాడారు. ఐదారు నిమిషాలపాటు ఇద్దరూ కాస్త పక్కకెళ్లి ఏకాంతంగా మాట్లాడుకున్నారు. 

పక్కన మంచు మనోజ్ తప్ప ఇంకెవ్వరూ లేరు. ఈ సందర్భంగా అప్పటి తన వ్యాఖ్యలపై మోహన్ బాబుకు పవన్ కల్యాణ్ వివరణ ఇచ్చి ఉండొచ్చని అంటున్నారు. దీంతో ఆ వ్యవహారం అక్కడితో సద్దుమణిగిపోయిందని, పవన్ కు మోహన్ బాబు కౌంటర్ ఉండకపోవచ్చని కూడా చెబుతున్నారు.

మొత్తమ్మీద ఇప్పుడు బంతి ఇప్పుడు మోహన్ బాబు కోర్టులో ఉంది. పవన్ కి చాకిరేవు పెట్టినా, పంచ్ డైలాగులతో సరిపెట్టినా, అసలు పట్టించుకోకుండా వదిలేసినా.. మోహన్ బాబే చేయాలి. ''మా'' ప్రహసనం ముగిసింది. ఇక పవన్ ఎపిసోడ్ కు ఫినిషింగ్ టచ్ మాత్రం మిగిలి ఉంది.