మెగాబలం వాపేనా?

''..గతంలో ఫలానా ఫలానా వారికి మద్దతు ఇచ్చాను. వారు గెలిచారు. అలా అని నేను మద్దతు ఇచ్చిన వారంతా గెలుస్తారని చెప్పడం లేదు..'' ఇదీ మెగాఫ్యామిలీ నటుడు నాగబాబు రెండు రోజల క్రితం చెప్పిన…

''..గతంలో ఫలానా ఫలానా వారికి మద్దతు ఇచ్చాను. వారు గెలిచారు. అలా అని నేను మద్దతు ఇచ్చిన వారంతా గెలుస్తారని చెప్పడం లేదు..'' ఇదీ మెగాఫ్యామిలీ నటుడు నాగబాబు రెండు రోజల క్రితం చెప్పిన మాట. గత రెండు రోజులుగా ఓపెన్ గా బయటకు వచ్చి నాగబాబు నానా హడావుడి చేసారు. సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావు మీద నోరు పారేసుకున్నారు. 

సరిగ్గా కొన్ని నెలల కిందట ప్రకాష్ రాజ్ తనంతట తాను మా సంస్థ అధ్యక్షుడిగా పోటీ చేయబోతున్నానని ప్రకటించిన తరువాత ఆయన కు మద్దతుగా చానెళ్ల ముందుకు వచ్చింది నాగబాబే. అక్కడి నుంచే మెగా సపోర్టు తో ప్రకాష్ రాజ్ పోటీ చేస్తున్నారన్న ప్రచారం ఊపు అందుకుంది. 

అక్కడితో ఆగలేదు. చిరంజీవికి మోహన్ బాబు ఫోన్ చేస్తే, ఈ టెర్మ్ ప్రకాష్ రాజ్ కు వదిలేయమని అడిగారన్న ప్రచారం బయటకు వచ్చింది. ఇండిపెండెట్ గా పోటీ చేస్తానన్న జీవితను సైతం ప్రకాష్ రాజ్ వైపు తిప్పారు. 

ఇవన్నీ చాలవన్నట్లు బహిరంగ వేదిక మీద పవన్ కళ్యాణ్ కూడా ప్రకాష్ రాజ్ కు మద్దతుగా మాట్లాడారు. ఎన్నికలు రెండు రోజుల దూరంలో వుండగా నాగ బాబు ఓపెన్ గా నానా హడావుడి చేసారు. ఆ విధంగా అన్ని విదాలా మెగా క్యాంప్ అభ్యర్థి ప్రకాష్ రాజ్ అని ముద్రపడింది. 

మరి ఇంత జరిగాక, దాదాపు 11 మంది మెగాహీరోలు వున్న పరిశ్రమలో నటీనటుల సంఘం మెగా క్యాంప్ కంట్రోల్ లో వుంటుందని ఎవరైనా అనుకుంటారు. కానీ ఫలితం చూస్తే దిమ్మదిరిగిపోయింది. మెగా క్యాంప్ ను సింపుల్ గా పక్కన పెట్టేసినట్లయింది.

దీనికి ఒక కారణం కాదు చాలా వున్నాయ. సీనియర్ నటుడు కోటా మీద నాగబాబు నోరు పారేసుకున్న వైనం. ఓపెన్ డయాస్ మీద రెడ్లు..రెడ్లు అంటూ పవన్ చేసిన వ్యాఖ్యానాలు..కుటుంబానికి ఓ హీరో నుంచి రెండుహీరొల వంతున దింపుతూ, చిన్న సైజు క్రికెట్ టీమ్ అంత పెంచేసారు మెగా హీరోల సంఖ్యను. ఇది తెలియకుండానే సినిమా జనాల్లో విముఖతను పెంచుతోంది. అన్నీ వారేనా..సామాన్యులకు అవకాశం వద్దా అనే భావన పెరిగింది.

మెగా క్యాంప్ అనగానే కాపు సామాజిక వర్గం అనే భావన కూడా వుంది. దాంతో ఎప్పటి నుంచో టాలీవుడ్ మీద తమకు వున్న పట్టు నిలబెట్టుకోవాలనే భావన కమ్మ సామాజిక వర్గంలో కలిగింది. పైకి ఎన్ని కబుర్లు చెప్పినా సినిమా రంగం కమ్మ..కాపు అనే రెండుగా చీలిపోయింది. 

తమ తరపున, తమ ఆశీస్సులతో ప్రకాష్ రాజ్ బరిలో వున్నారని తెలిసి కూడా ఓపెన్ గా మెగాస్టార్ ఓ పిలుపు ఇవ్వలేకపోయారు. ఇచ్చివున్నా ఇంతకన్నా మెరుగైన ఫలితం రాదనే అనుకోవాలి. ఎందుకంటే నాగబాబు వేరు చిరంజీవి వేరు అని ఎవ్వరూ అనుకోరు కదా?

గమ్మత్తేమిటంటే మెగా సపోర్ట్ తో ప్రకాష్ రాజ్ బరిలో వున్నాడని తెలిసి కూడా బన్నీ, అల్లు శిరీష్ ఓటు వేయడానికి రాలేదు నాగబాబు పిల్లలు నీహారిక, వరుణ్ కూడా రాలేదు. ఇంక మరేం సీరియస్ నెస్ వున్నట్లు తమ అభ్యర్థిని గెలిపించుకోవాలని. కానీ విష్ణు వెనుక అన్నీ తానై నిలిచిన నరేష్ అన్ని విధాలా కిందా మీదా కష్టపడ్డాడు. 

విష్ణ కూడా అద్భుతమైన పోల్ మేనేజ్ మెంట్ ను రచించి అమలు చేసాడు. వందల మంది మనుషులు వచ్చి మెంబర్లను తీసుకుని రావడం, ఓటింగ్ కు వచ్చిన వారికి సహకరించడం, నిత్యం ప్రతి ఒక్క సభ్యునికి ప్రతి ఒక్క పోటీ దారు ఫోన్ చేసి మాట్లాడడం ఇలా చాలా ప్లానింగ్ తో వెళ్లారు. ఇది ప్రకాష్ రాజ్ టీమ్ లో కరువైంది.

మొత్తం మీద టాలీవుడ్ మీద మెగా కంట్రోలు వుంది అన్నది కేవలం భ్రమే అని ఈ ఎన్నికలు రుజువు చేసాయి. ఇకపై ఆ భ్రమలు మరింతగా అలా అలా తొలగిపోయే పరిస్థితే కనిపిస్తోంది.